అల్లసాని పెద్దన
అల్లసాని పెద్దన :- స్వారోచిష మనుసంభవ కర్తగా అల్లసాని పెద్దన యాంధ్రసాహిత్య లోకమున సుప్రసిద్ధుడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు, ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రుడు. వశిష్ఠసగోత్రుడు. తండ్రి పేరు చొక్కనామాత్యుడు. బళ్ళారి మండలమునందలి ‘దొరాలయము' లేక 'దోరాల' యను గ్రామ మీ కవి జన్మ స్థాన మని జనశ్రుతి కలదు. ఈతని బాల్యమును గూర్చియు విద్యాభ్యాసమును గూర్చియు మన కంతగా తెలియదు. శఠకోపయతి తనకు గురు వని తెలిపి, మనుచరిత్ర పీఠికలో పెద్దన గురుస్తుతి కావించెను. తన కవిత్వము శఠకోపయతి ప్రసాదాసాదిత మని యితడు వాకొనెను. శిష్యుడయిన పెద్దన కీ శఠకోపస్వామి హయగ్రీవ మంత్రము నుపదేశించెననియు, తత్ప్రసాదమున నతనికి
కవితాధార సిద్ధించెననియు గొందరు వ్రాసిరి. ఏది ఎట్లున్నను విద్యాభ్యాసానంతరమున బెద్దన యెట్లో కృష్ణరాయల యాస్థానమును జేరి అష్టదిగ్గజములలో నగ్రగణ్యుడని పేరొందెను. పారిజాతాపహరణ కర్త యగు నంది తిమ్మన, రాజశేఖరచరిత్రమును రచించిన మాదయగారి మల్లనయు, కాళహస్తి మాహాత్మ్య రచయిత యగు ధూర్జటియు నితనికి సమకాలికులగుటయేగాక, రాయల యాస్థానమునందే యుండిరి. అష్టదిగ్గజములలోనివారే యగు మాదయగారి మల్లన్నయు వసుచరిత్ర కర్త రామ రాజభూషణుడును, పెద్దనకు శిష్యులని ప్రసిద్ధి.
సంస్కృతాంధ్రములయందు పెద్దన గొప్ప పండితుడు; కర్ణాటక భాషా పరిచితియు కలవాడు. పురాణాగమేతిహాస కథార్థశ్రుతియుతుడు. చతుర్విధ కవితా విశారదుడు. చతుర వచోనిధి. కవి పండిత మండిత మగు నిండుసభలో న సమానమగు నాశుకవితాధోరణిచే 'సాహిత్య సమరాంగణ సార్వభౌము' డగు కృష్ణరాయలను మెప్పించి, బిరుదు గండపెండేరమును తన పాదమున తొడిగించుకొనిన మేటి. ఆస్థాన కవిశ్రేష్ఠుడుగను, పరీక్షాధి కారిగనుఉండియు ఈర్ష్యారహితుడై యనేకాంధ్రకవులకు రాయలచే సన్మానము చేయించిన యుదార శీలుడు. శ్రీకృష్ణ దేవరాయ లతనిని 'ఆంధ్రకవితా పితామహ' బిరుదముతో బహూకరించెను. ఈ బిరుదము "పెద్దనకు పూర్వమునను, పరమునను నున్న దేయైనను నిది
యితనిపట్ల నవ్వర్థమైన ట్లన్యుల యెడ కాలేదు. తన పోషకుడగు రాయలచే నితడందిన గౌరవ మసాధారణము. ఈ కవి యెదురయినచో రాయలు తన మదకరీంద్రము డిగ్గి కేలూత యొసగి యెక్కించుకొను చుండెనట మను చరిత్రమును కృతినందువేళ పల్లకిని తన కేలబట్టి యెత్తెనట. ఇంతమాత్రమేకాక రాయ లితనికి నడిగిన సీమలం దనేకాగ్రహారములిచ్చి మన్నించెను. విశేషముగ రాజసన్మానము లందిన యాంధ్ర కవులు శ్రీనాథ, పెద్దన లిరువురే.
శ్రీనాథుని వలెనే పెద్దనయు యౌవనమున సమస్త భోగభాగ్యము లనుభవించెను. కాని వార్ధక్యమున నతని వలె నిడుమల బడలేదు. రాయలు పెద్దనకొసగిన యగ్రహారము లనేకములు, వానిని జీవితాంతము దాననుభవించుటేకాక, కోకట గ్రామమునకు 'శఠకోపపుర' మని పేరు పెట్టి దానిని దేవబ్రాహ్మణుల కగ్రహారముగా నొసగి పెద్దన తన గురుభక్తిని ప్రకటించుకొనెను. శఠకోప యతికి శిష్యుడయిన పిదప నీకవి వైష్ణవ మతాభిమానిగా మారెనని తెలియుచున్నది. అట్లయ్యు నితడు పరమత ద్వేషములేక యద్వైతభావము గలిగియుండెను. పెద్దన తన యగ్రహారములలోని కొంత భూమిని శివకేశవులకు నిరువురకును ధూపదీప నైవేద్యాది అంగరంగ భోగములకు దానముచేసి యుండుటయు, మనుచరిత్రాదిలో నీశ్వరస్తుతి గావించుటయు నిందుకు తార్కాణములు. ప్రభువులవలన నగ్రహారములు పడసిన కవులు పలువురు కలరు. కాని వారిలో ననేకములను దేవబ్రాహ్మణ వినియోగమునకు శాసన పూర్వకముగా దానముచేసిన యాంధ్ర కవిశిఖామణి పెద్దన యొక్క డే! పెద్దన మను చరిత్రమను ప్రబంధమును మాత్రమేకాక హరికథా సారమను గ్రంథమునుగూడ రచించినట్లు రంగారాట్భం దాదుల వలన తెలియుచున్నది. కాని యీ గ్రంథము లభింపలేదు. ఇవికాక యితడు సీసపద్య శతకమును రచించెనని కొందరును, రామస్తవరాజము, అద్వైత సిద్ధాంతము అను మరిరెండు కృతులను వ్రాసెనని కొందరును వ్రాసిరి. కాని వీనినిగూర్చి మనకేమియు తెలియదు. సత్యావధూ ప్రీణనాది సంస్కృత గ్రంథములు 'ఆముక్త మాల్యద' యను నాంధ్ర ప్రబంధముగూడ .