Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసాని పెద్దన


లకు మార్చి, స్త్రీస్వభావము నత్యంత సహజముగ చిత్రించెను. కావుననే ‘పాటున కింతులోర్తురె' యని పెద్దన వ్రాసిన పద్యము ననుసరించి తర్వాతి ప్రబంధములలో రోదనపద్యము లనేకములు పుట్టినవి.

త్వతీయాశ్వాసమున మాయా ప్రవరుని వంచక స్వభావమును గ్రంథకర్త నేర్పుతో జిత్రించెను. ఈ ప్రబంధము నందలి మొదటి మూడాశ్వాసములు రసవత్తరములు, మధుర భావ విలసిత చతుర కవితాశోభితములు. నాల్గవ ఆశ్వాసము నందలి స్వరోచికృతమైన వేటయంతయు పెద్దన కల్పించినదే. పెద్దన శృంగార శాకుంతలములోని వేట ననుసరించి దీనిని సృష్టించి పెంచి వ్రాసెను. భాషయు, శైలియు ప్రత్యేకమై యుండుటయేగాక యిది కవియొక్క లోకజ్ఞానమునకు గీటురాయివంటిది. మనోరమా వృత్తాంతము నీయాశ్వాసముననే కలదు. మనోరమా స్వరోచుల వివాహము సంప్రదాయాను సారముగా విపులముగా వర్ణింపబడినది. కడపటి దగు నారవయాశ్వాసమున కళావత్యాదుల శాపమోచనము, స్వరోచితో వారి పరిణయము, వనదేవతయందు స్వారోచి జననము, తపస్సు, విష్ణుసాక్షాత్కారము, స్వారోచికి మనుత్వసిద్ధి, అతని రాజ్య పరిపాలనము అను విషయములు కలవు.

ఈ ప్రబంధమున సందర్భానుసారముగ ననేక నీతు లుపదేశింప బడినవి. చతుర్థ పురుషార్థ కామి యగు వైదిక గృహస్థునకు ప్రవరు డాదర్శ పురుషుడు. ప్రవరసిద్ధుల సంభాషణమునందు గార్హస్థ్య సన్యాస ధర్మములును వాని యౌత్కృష్ట్యమును తెలుపబడినవి. వరూధినీ ప్రవరుల ఘట్టమున బ్రహ్మానందమును గోరువారు శమదమాదిగుణ సంపన్ను లగుటతోబాటు పరవిత్త పరనారీ విముఖులు కావలెననియు ధర్మకర్మాద్యనుష్ఠానములచే నివి సుసాధ్యము లనియు, నిశ్చల వైరాగ్య చిత్తులగు ధీరుల చిత్తముల నెట్టిపరిస్థితియందును స్త్రీల మాయలు కలంచజాలవనియు, కవి సూచించెను. మరియు ధర్మ కామములకు సంఘర్షము కలిగినపుడు యత్నముచే ప్రవరునివలె ధర్మమునే రక్షించు కొనవలెననియు కవి బోధించెను. దివ్యజ్ఞాన సంపన్ను లయ్యును కేవల కాముకు లెట్లు పరుల మోసములకు లోనగుదురో, పరవంచన కెట్లు తలపడుదురో ఈ విషయముల వరూధినీ మాయాప్రవర వృత్తాంతములు క్రమముగా నెరిగించుచున్నవి. ధర్మ సమ్మతమయ్యును బహుభార్యాత్వము నింద్య మనియు, స్వకళత్రమునం దయినను నమితభోగేచ్ఛగల వాని బ్రతుకుపై పశుపక్ష్యాదులకు సైతము రోత కలుగు ననియు స్వరోచి వృత్తాంతమువలన తెలియుచున్నది.

ఒక్క ప్రవరునిపాత్ర తక్క యిందలి పాత్ర లన్నియు నతి మానుషము అయిన గంధర్వాప్సరాది దేవత పాత్రలు. స్వరోచి పాత్ర మనుజ గంధర్వ సమ్మిశ్రితముగా గోచరించును. అట్లయ్యును వాని సుఖదుఃఖాదులతో మనకు సంపూర్ణ సానుభూతి కలుగునట్లు కని వానిని నిపుణముగ పోషించెను. కోపస్వభావులును శాపాయుధులు నగు మునులును నిందుగనుపింతురు శాంత స్వభావుడగు ప్రవరుని పాత్రకు వన్నె దెచ్చుటకే వీరి కథలు పెంచి వ్రాయబడినట్లు తోచును. ఇట్లి మహాకవి మూల కథను పెంచి రసభావపూరిత మహాప్రబంధముగ తీర్చి దిద్దుటచే నాంధ్రకవితాపితామహ బిరుదు మితనియందు సార్థకము. దీనికితోడుగా చక్కని ప్రకృతి చిత్రములను, సుందర సన్ని వేశములను, సందర్భానుకూలము లయిన సరస సంభాషణములను పొందుపరచి, నుడికారములను వాడి, జాతీయములను సంతరించి, శబ్దార్థాలంకారములను సవరించియు పెద్దన తనప్రబంధమునందలి యందము నధిక మొనర్చెను. ఈ కారణముననే రామరాజభూషణుడును తదితర ప్రబంధ కవులును మనుచరిత్రము ననుసరించి తమ రచనలను సాగించిరి. పెద్దనయు శ్రీనాథాది పూర్వుల ననుసరించుటయే కాక మనుచరిత్రమున నన్య దేశీయముల నందముగ ప్రయోగించెను.

పోషకు డగు శ్రీకృష్ణదేవరాయలచే నిట్లత్యంతముగ మన్నింపబడి, రాయల యనంతరమున 'కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికి యుంటిని జీవచ్ఛవంబు వోలె' అని దుఃఖించెనేకాని 'మరి హేమపాత్రాన్న మెచట గలుగునని విలపింపలేదు పెద్దన. రాయలు లేని రాజధాని యందుండలేక వైరాగ్యచిత్తుడై తన గురువర్యుడగు శఠకోపయతి యున్న కోకటగ్రామ సమీపమున పెద్దనపాడను గ్రామమును జేరి యందే జీవిత శేషమును గడపెను. హరికథాసారమును పెద్దన యీ కాలమున రచించి