సైన్యములు ముందడుగు వేయ నిరాకరించెను. ముల్తాను ప్రాంతములందలి యాటవిక జాతులు అలెగ్జాండరునకు అనేక కానుకలు సమర్పించెను.
అలెగ్జాండరు డరయస్ కుమార్తె స్టాటిరాను పెండ్లి యాడెను. ఇతని ప్రథమ కళత్రము సోద్దియానా యనునామె. ఈ బహుభార్యాత్వములో ఇతడు తండ్రివలె ప్రాచ్యపద్ధతి నవలంబించెను. టైగ్రెస్ దాటి, ఓపిస్ (Opis) దగ్గర సైన్యములను ఇంటిదారి పట్టించెను, బాబిలోనును తన సామ్రాజ్యమునకు కేంద్రముగ చేయగోరి ఇతడిచట గొప్ప నౌకాశ్రయమును గట్టించెను. క్రీ.పూ.323 లో 33 సం. లు నిండక పూర్వమే అలెగ్జాండరు మితిమీరి త్రాగుటవలన మరణించెను.
ఆఫ్ఘనిస్థానమును, ఆక్టస్ (Oxus) నది కీవలి భాగమును, సింధునదీ ప్రాంతము వరకును జయించిన పర దేశీయులలో మొదటివాడు అలెగ్జాండరు. ఇతని శిబిరము ఒక మహానగరమువలె నుండెడిది. కవులు, గాయకులు, చరిత్రకారులు, నట్టువరాండ్రు, స్త్రీలు, ఇందు ఉండిరి. దర్బారు దినచర్యలో దైనందిన విషయము లన్నియు వ్రాయబడుచుండెను. షుమారు 13 ఏండ్లలో అలెగ్జాండరు అప్పటికి తెలిసిన ప్రపంచములో నర్ధభాగమును జయించెను. ఇతడు 12 గురు దేవతలకు కట్టించిన గుడులు కాలగర్భమున లీనమైనవి. ఇతని కాలపు శిలాప్రతిమా శిల్పచ్ఛాయలు బౌద్ధశిల్పములో లీనమై యుండవచ్చును. అసమాన సైన్య విజయములను గాంచిన యీ జయశీలి సామ్రాజ్యము ఇతని అనంతరము 3 ఏండ్లలోనే విచ్ఛిన్న మయ్యెను.
డా. వి. య.
అల్యూమినియము (స్ఫటము) :- ఉనికి ప్రకృతిలో ఆమ్లజని, సైకతము (Silicon) తరువాత అల్యూ మినియము సమృద్ధిగా దొరకును. భూమి యొక్క గట్టిగా నున్న పై భాగమున అది 7.4 శాతము ఉండును.
అల్యూమినియము యొక్క ముఖ్య ఖనిజములను ఈ క్రింది విధముగా వర్గీకరింప వచ్చును.
1. సైకతీయములు (శైలితములు) :- అల్యూమినియము చాలవరకు సైకతీయముల రూపమున దొరకును. వానిలో అన్నిటికంటే ముఖ్యమైనది కయొలిన్ (ప్రమృత్). పొటాశీయ అభ్రకము, పొటాశీయ భూ స్ఫటికము.(Potash felspar)