Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలెగ్జాండరు

ఖనిజములు  : ఇచ్చటి రాళ్ళలో ఖనిజములు దొరుకును. ఇందు బంగారపు గనులు చాల ముఖ్యమైనవి. ఇచ్చట రాగి కూడ విరివిగా లభించును. బొగ్గుకూడ దొరకును, చిటినా నది లోయలో నున్న కెన్ని కాటు రాగి గనులు ముఖ్యమైనవి. అలాస్కాలోని ఈశాన్య దిక్కున నున్న కెచికన్ కూడ తామ్రోత్పత్తికి ప్రాముఖ్యమును వహించినది. కాటలా, మాటనుస్కా అనునవి బొగ్గునకు ముఖ్యమైన గనులు. కాటలాగనిలో ఆంత్రోసైటు రకపు బొగ్గు పొరలు పొరలుగా దొరకును. మాటనుస్కా గనిలో మెత్తని బొగ్గు (Bituminous), కొలదిగ గట్టియయిన బొగ్గు (Sub- bituminous) లభించును. నానాయిమా గనిలో కొంత హీనమైనబొగ్గు దొరకును.

జూనో, విల్లోక్రీకు, ప్రిన్సువిలియం సౌండు అను గనులలో బంగారము దొరకును, ఇందులో కొంత బంగారము ఇసుకతోను, మట్టితోను కలిసి లభించును.మరికొంత గనుల పొరలనుండి లభించును.

రవాణా సౌకర్యములు : ఈ దేశమున పెక్కు నదు లున్నవి. అందుచేత నౌకాయానమునకు ప్రాముఖ్యము చేకూరినది, బొగ్గు ఉత్పత్తి కారణముగా రైల్వేలుగూడ అభివృద్ధి చెందినవి. భారీ సరకులు సముద్రమార్గమున రవాణా చేయబడుచున్నవి. ప్రయాణించువారికిని, తేలిక సరకుల రవాణాకును విమానములు అధికముగ ఉపయోగపడు చున్నవి.

జనులు  : ఎస్కిమోలు, హైడాలు, ఖ్లిన్కిట్లు, అధో పొస్కనులు అను నాలుగు తెగల జనులు ఇచ్చట నివ సించుచున్నారు. జపానీయులు, చైనీయులు ఇక్కడకు వలసవచ్చి యున్నారు. ఇచ్చటి జనులు యూరోపియనుల మతాచారములను అవలంబించుచున్నారు.

రెడ్డు ఇండియనులు అఫోగ్నికు ద్వీపములో నివాసములను ఏర్పరచుకొనిరి, సముద్రతీరమందును ఇతరపట్టణము లందును తెల్లజాతివారు నివసించుచున్నారు, వారు తరచుగా తమ నివాసములను మార్చుకొను చుందురు. సిట్కా, డగ్లసు అను నగరములు ముఖ్యమైనవి. ఈ పట్టణప్రాంతములందు ఖనిజ ఉత్పత్తి విరివిగా జరుగును.

ఇచ్చటి సైనికోద్యోగీయులలోను రాష్ట్ర పరిపాలన-ఉద్యోగీయులలోను పెక్కురు అమెరికా సంయుక్త రాష్ట్రములనుండి వచ్చినవారే. ఈ ప్రదేశము యుద్ధ వ్యూహములకు సహజముగ తగియున్నది.

బి. యన్. చ.

అలెగ్జాండరు  :- అలెగ్జాండరు చక్రవర్తి క్రీ. పూ. 356 లో గ్రీసులో జన్మించెను. ఇతని తండ్రి మాసిడోనియా రాజగు ఫిలిప్పు, తల్లి యెపిరట్ రాకుమార్తె యగు ఒలింపియస్. సుప్రసిద్ధ వేదాంతవేత్తయైన అరిస్టాటిల్ ఇతని గురువు. 18 వర్షముల ప్రాయమున అలెగ్జాండరు చెరోనా యుద్ధములో అశ్వదళాధిపత్యమువహించి శత్రు సైన్యముల చెండాడి తన భావి యసమాన సమర నైపుణ్యమునకు దగిన సూచనలను చూపెను. ఇరువది యేండ్ల వయసున అలెగ్జాండరు సింహాసన మధిష్ఠించెను.

శత్రువుల తిరుగుబాటులను అణచెను. ఒక సంవత్సరములో ఐరోపాను జయించి ఆసియాపై దండెత్తుటకు సంసిద్ధు డయ్యెను. అలెగ్జాండరు 30,000 కాల్బంటులతో, 5000 ఆశ్వికదళములతో ఆసియా జై త్రయాత్రకై బయలు వెడలెను. ఇతని జీవితములో మిగిలిన 12 ఏండ్లు ఆసియాయందే గడచెను. ఇతడు తాను విడిసిన చోటులందెల్ల పూర్వులను గౌర వించి, దేవతల నారాధించెను. ట్రాయి పట్టణములో ఎథీనా దేవాలయములో బలియిచ్చెను. మిలెటిస్ ను గెల్చిన తరువాత తన నౌకాదళమును విచ్ఛిన్నముచేసెను. ఇజస్ యుద్ధములో పర్షియన్ రాజగు డరియస్ ను పరాజితుని జేసెను. తన విజయ చిహ్నముగా ఇజస్ సమీపమున ఇతడు అలెగ్జాండ్రియా పట్టణమును కట్టించెను. ఈజిప్టును గెల్చి, అలెగ్జాండ్రియా రేవుపట్టణమును సృష్టించెను. ఈ ప్రాంతములందు గ్రీకు నాగరకతను, వ్యాపారమును వృద్ధిచేసెను. టైగ్రెస్ నదిని దాటి బాబిలోనియాను గెల్చెను. పెర్సిపోలిస్ ను వశపరచుకొనెను.

అలెగ్జాండరు తక్షశిల జేరి అచటి రాజును వశపరచు కొనెను. హిదా స్పెస్ యుద్ధములో పురుషోత్తముని ఓడించెను. శతద్రూనదిని సమీపించుటతో అలెగ్జాండరు