Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


శాస్త్రనామము  : ప్రాచీనాలంకారికులయిన భామహ, వామన' రుద్రటులు తమ గ్రంథములకు సాధారణముగా "కావ్యాలంకారము” అను పేరునే పెట్టిరి. ఈ గ్రంథములకు ఈ పేరు పెట్టుటకు ముఖ్యముగా వీటిలో అలంకారములకు ప్రాధాన్యమిచ్చుటయే ఐయుండును. అలంకారము అనగా అలంకరించునది. కావ్యశోభా హేతువైనది. కావ్యాలంకారముల గూర్చి లక్ష్యలక్షణములను తెలుపునట్టిది. కాబట్టియే, ఈ శాస్త్రమునకు 'అలంకారశాస్త్రము' అని పేరు పెట్టబడినది. కొందరు లాక్షణికులు తమ గ్రంథములకు అలంకారశాస్త్రమని పేరు పెట్టలేదు. ఉదా:- దండి కావ్యాదర్శము. ధ్వని కారుడు అలంకార శాస్త్రకర్తలను కావ్యలక్షణ కర్తలు అనియే వ్యవహరించెను. ఈ లక్షణ గ్రంథములకు సాహిత్య శాస్త్రమని కూడ మరియొక పేరు కలదు. తరువాతి లక్షణగ్రంథకర్తలు సాహిత్యశబ్దమును కావ్యము అను నర్థమునందే. వాడినారు. బిల్హణుడు 'సాహిత్య పాథో నిధి మంథనోత్థం' అని సాహిత్యశబ్దమును తన విక్రమాంక దేవచరితమునందు కావ్యము అను నర్థమునందు ఉపయోగించినాడు. రాజ శేఖరుడు సాహిత్యశాస్త్రము అయిదవ శాస్త్రమనియు అది చతుశ్శాస్త్రముల సారమనియు తన కావ్య మీమాంసలో తెల్పివాడు. సాహిత్యమనగా శబ్దార్థములు సహితములైయుండుట అని నిర్వచనము చెప్పవచ్చును. సాధారణముగా కావ్యలక్షణములను తెలుపు శాస్త్రమును సాహిత్యశాస్త్రమని కూడ వాడుట పరిపాటియై వచ్చుచున్నది.

అలంకారశాస్త్ర విషయములు  : 1. కావ్యప్రయోజనములు, 2. కావ్య హేతువులు, 3. కావ్య విభాగములు 4. శబ్దార్థములు శబ్దశక్తులు, 5. కావ్యలక్షణములు, రస, అలంకార, రీతి, ధ్వని, ఔచిత్య, వక్రోక్తి వాదములు, 6. కైశిక్యాది వృత్తులు, 7. దోషములు మున్నగునవి అలంకార శాస్త్రమునందు చర్చింపబడు విషయములు.

పైన సూచింపబడిన విషయములను అన్నింటిని సాధారణముగా అలంకార శాస్త్ర గ్రంథములన్నియు చర్చించినవి. ఈ శాస్త్రగ్రంథములు అనేక వర్గములుగా నున్నవి. (1) విశ్వనాథుని సాహిత్య దర్పణము, విద్యానాథుని ప్రతాపరుద్ర యశోభూషణము ఈ రెండు కృతులును

పై విషయములను నాటక లక్షణములతోపాటు సమీక్షించినవి. (2) దండి కావ్యాదర్శము, వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి, భామహ, రుద్రట, వాగ్భటుల కావ్యా లంకారములు, మమ్మటుని కావ్య ప్రకాశము. జగన్నాథ పండితుని రసగంగాధరము - ఈ మొదలయిన అనేక సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథములు ఒక నాటక లక్షణమును తప్ప కావ్య విషయములనన్నింటిని ప్రాయికముగ చర్చించినవి. (3) భరతుని నాట్యశాస్త్రము, ధనంజయుని దశరూపకము మొదలగు కొన్ని గ్రంథములు నాటక లక్షణములు, రసస్వరూపమును మాత్రమే చర్చించినవి. (4) అలంకార సారసంగ్రహము, అలంకార సర్వస్వము, కువలయానందము, చిత్రమీమాంస, మొదలగు అనేక కృతులు అలంకారములను మాత్రమే చర్చించినవి. (5) కొలది గ్రంథములు ప్రత్యేక సిద్ధాంతములను చర్చించినవి. వాటిలో ధ్వన్యాలోకము ధ్వనిచర్చను, వ్యక్తివివేకము వ్యంజనావృత్తి ఖండనమును, వక్రోక్తి జీవితము వక్రోక్తి చర్చను చేసెను. మేమేంద్రుని ఔచిత్య విచారచర్చ ఔచిత్యమే కావ్యజీవితము అను విషయమును ప్రతిపాదించెను.

1. కావ్య ప్రయోజనములు : కావ్యము కళాత్మకము. దానివలన భావుకులకు వెంటనే రసానందము కలుగును. సంస్కృత కావ్యవిమర్శకులు పురాతన కాలమునుండియు రసానందమునే కావ్యప్రయోజనముగా పేర్కొనిరి. ధ్వన్యాలోక వ్యాఖ్యాతయగు అభినవగుప్తుడు, కావ్యమునకు ప్రీతియే ప్రయోజనము, అదియే రసాత్మగా నుండునని చెప్పినాడు. అలంకార శాస్త్రకర్తలు కావ్య ప్రయోజనమును అనేక విధములుగ తెలిపినారు. (1) దుఃఖశాంతి. (2) మతవిజ్ఞానము, తత్వశాస్త్రజ్ఞానము (3) కళానైపుణ్యము, వ్యవహార జ్ఞానము ఈ ప్రయోజనములు కావ్య పఠితకు చేకూరును. కావ్యరచన వలన కవికి కీర్తియు, ధనమును చేకూరును. నాట్యము, శ్రమము చేతను దుఃఖాదులచేతను పరితప్తులైన వారికి శాంతిని చేకూర్చును అని భరతముని చెప్పెను. సత్కావ్యము పఠితకు పురుషార్థము లందును, కళలందును, నైపుణ్యమును కీర్తిని, ప్రీతిని కలిగించునని భామహుడు చెప్పెను. కావ్య ప్రకాశకారుడు కావ్యమువలన కీర్తి, ధనము, విజ్ఞానము,