అలంకారశాస్త్ర చరిత్ర
మీమాంస (క్రీ. శ. 16 వ శతాబ్ది అంతము - 17 శ. ఆది); జగన్నాథుని రసగంగాధరము (క్రీ.శ. 1620 - 1660).
అలంకార శాస్త్రమనగా కావ్యమును కావ్యాంగములను గూర్చి వివరించు శాస్త్రము. ఇండోయూరపియను భాషలలో ఋగ్వేదము అత్యంత ప్రాచీనమైన ప్రథమ గ్రంథము. అది ప్రధానముగా దేవతలను గూర్చి చేయబడిన స్తోత్రాత్మకమైన మంత్రగ్రంథమైనప్పటికిని దానియందు కావ్య లక్షణములు విశేషముగా కాన్పించు చున్నవి. అందు ఉషస్సును వర్ణించు ఋక్కులు సుందర కావ్యఖండములు - కొన్ని ఋక్కులలో ఉపమా-వ్యతిరేక అతిశయోక్తి - శ్లేష - ఉత్ప్రేక్షాద్య లంకారములు మిగుల మనోహరములుగా ప్రయోగింపబడినవి. తరువాతి లౌకిక కావ్యములలో వలెనే వేదవాఙ్మయములో కూడ ప్రకృతి మున్నగువాటి వర్ణనము మనోహరముగ చేయబడినది. నాటక బీజములు కూడ వైదిక సాహిత్యమునందు కన్పట్టు చున్నవి. నాటక నిర్మాణము కొరకు ఋగ్వేదమునుండి పాఠమును, సామ వేదమునుండి గీతములును, యజస్సులు నుండి అభినయమును, అథర్వవేదమునుండి రసములును గ్రహింపబడినవని భరతుడు నాట్యశాస్త్రములో చెప్పెను.
వేద కాలము తరువాత క్రీస్తునకు అనేక శతాబ్దులకు పూర్వమే ఉత్కృష్టమైన కావ్యనిర్మాణము సంస్కృత వాఙ్మయములో చేయబడినది. రామాయణ మహాభారతములలో అత్యున్నతమైన కావ్యరచన సాగెను. అలంకార శాస్త్రములో ఉద్గ్రంథములైన ధ్వన్యాలోక, కావ్య ప్రకాశములలో మహాభారతమునుండి గృధ్రగోమాయు సంవాదాదులైన అనేక విషయములు ఉదహరింపబడినవి, రామాయణమునుండికూడ కొన్ని శ్లోకములు ఈగ్రంథములలో తీసుకొనబడినవి.
అలంకార శాస్త్రారంభము : క్రీ.శ. రెండవ శతాబ్ది నాటివియు, ఆ తరువాతివియు నగు శాసనములను బట్టి అంతకు పూర్వమే అలంకార శాస్త్రరచనము ఆరంభింప బడినట్లు తెలియుచున్నది. క్రీ.శ. 150వ సంవత్సరపు రుద్రదాముని జునాగఢ్ శాసనమునుబట్టి అప్పటికే కావ్యము గద్య పద్యాత్మకమయి యుండెననియు “స్ఫుట-మధుర - కాంత-ఉదార" అను కావ్యగుణములు తెలిసియుండెననియు స్పష్టమగుచున్నది. ఈ యంశమునే అంతకు కొంచెము పూర్వపుదైన “సిరిపులుమాయి” నాసిక శాసనముకూడ “తెల్పుచున్నది. అది ప్రాకృతభాషలో నున్నది. ఈ రెండు శాసనములే గాక క్రీ. శ. మొదటి రెండు శతాబ్దులలోని సంస్కృత ప్రాకృత శాసనములు ఈ విషయమును ధ్రువపరుచుచున్నవి. ఇంతియేగాక ఈ శాసనములలో 'గంధర్వవేద-నట-గీత-వాదిత్ర- ఉత్సవసమాజ" ఇత్యాది శబ్దములు వాడబడినవి. వీటిలో శబ్దాలంకారములు, దీర్ఘ సమాసములు కలవు. పూర్వపు గద్యప్రబంధములు ఈ శైలిలోనే వ్రాయబడుచుండెడివి. వీటినిబట్టి చూచినచో ప్రాచీన కాలమునందే అలంకార శాస్త్రము ఎంతో అభివృద్ధి చెందినట్లు కనిపించుచున్నది.
నిరుక్తమును వ్రాసిన యాస్కముని, ఋగ్వేదములోని “ఇదమివ, ఇదంయథా, అగ్నిర్న, తద్వత్" మొదలయిన ఉపమాలంకార ద్యోతకములగు పదములను ఉదాహరించెను. ఇవియేకాక అనేక ఉపమలు వేద వాఙ్మయములో ఉన్నట్లు తెలుపుచు యాస్కముని ఉపమా భేదములనుకూడ వివరించెను. పాణిని వ్యాకరణ సూత్రములకు పూర్వమే ఉపమాలంకారమునకు అంగములైన ఉపమాన, ఉపమేయ, సామాన్యధర్మ, ఉపమా వాచకములు తెలిసియుండినట్లు "ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్యా ౽ ప్రయోగే; 'ఉపమానాని సామాన్య వచనైః' " ఇత్యాది సూత్రములవలన మనకు స్పష్టమగు చున్నది. వ్యాసుని బ్రహ్మ సూత్రములలో ఉపమా రూపకాలంకారములు పేర్కొనబడినవి. క్రీ. శ. ఒకటి రెండు శతాబ్దులలో రచింపబడిన అశ్వఘోషుని బుద్ధ చరితము, సౌందరనందము అను కావ్యముల వలన పూర్వమే కొన్ని అలంకారములు ప్రచారములో నుండినట్లు తేటబడుచున్నది. భరతుని నాట్యశాస్త్రములో రససిద్ధాంతము, నాటక లక్షణము, నాలుగు అలంకారములు, గుణములు వివరింపబడినవి. బాణుడు తనకాదంబరిలో అక్షరచ్యుతక, మాతాచ్యుతక, బిందుమతి మొదలగు ప్రహేళికలను, శ్లేష - ఉత్ప్రేక్ష - ఉపమ - దీపకము ఇత్యాద్యలంకారములను గుర్తించెను. పైన పేర్కొనబడిన అంశములను బట్టి క్రీ.శ. 6వ శతాబ్దివరకే లౌకిక సంస్కృత వాఙ్మయములో అలంకారములు, కావ్యభేదములు ఏర్పడి ఉండినట్లు మనకు తెలియుచున్నది.