అరవిందుడు
1904 - 1906 సం॥లలో జరిగిన కాంగ్రేసు సభలకు హాజరయి, అతివాద పక్షముయొక్క చర్చలయందును, చతుస్సూత్ర ప్రణాళికా నిర్మాణము నందును ప్రముఖమైన పాత్రను వహించెను. స్వరాజ్యము, జాతీయ విద్య, స్వదేశీయత, విదేశవస్తు బహిష్కరణము అనునవి చతుస్సూత్రములు.
1906 వ సం౹౹ లో శ్రీ అరవిందుడు బరోడాయందలి ఉద్యోగమునుండి విరమించుకొని కలకత్తాకు వచ్చి “వందే మాతరం" అను పత్రిక యొక్క సహాయకత్వమును స్వీకరించి, జాతీయపక్షమునందు సభ్యుడుగా ప్రవేశించెను. ఆత్మవిశ్వాసములేక చెల్లాచెదరై యున్న కాంగ్రెసు పక్షములలో ఆతడు తన ఉజ్జ్వలాదర్శములను, సంధిషరతుల నంగీకరింపని తన జాతీయ భావములను, కొంతవరకు రగుల్కొలిపెను. జాతీయ నాయకులను సమావేశపరచి దేశమునకు ఆతడు ఒక విప్లవాత్మక కార్యక్రమమును సిద్ధపరచెను. శ్రీ అరవిందు డిట్లు ఆకస్మికముగా అతివాద జాతీయత యొక్క మహా తత్త్వవేత్త అయ్యెను. వంగ విభజనము యొక్క ప్రతి ఘటనమునకు చిహ్నముగా ఏర్పడిన జాతీయ కళాశాల కతడు తొలి ప్రధానాచార్యుడా యెను. కాని త్వరలో ఈ కళాశాలను వదలి సంపూర్ణముగ రాజకీయములలో నిమగ్నుడయ్యెను.
తెరమరుగునుండి 'వందే మాతరమ్' అను గీతము బయలు వెడలి ఒక్కుమ్మడిగా వ్యాపించి ప్రతి భారతీయుని జిహ్వాగ్రమున నాట్యమాడ దొడగెను. నిజమునకు 'వందే మాతరమ్' అను పత్రికకు వెనుకనున్న శక్తి శ్రీ అరవిందునిదే. ఇతని సంపాదకీయములును, ఇతర రచనలును ప్రజల ప్రశంసల నందుకొనెను. ఆంగ్లో-ఇండియన్ పత్రికలకు నైరాశ్యమును కల్పించెను. కాని ప్రభుత్వమిక 'వందేమాతరమ్' అను పత్రికను ఉపేక్షింపజాలక పోయెను. అందుచే న్యాయవిచారణ సభలో అరవిందునిపై నేరారోపణము (Prosecution) ప్రారంభమయ్యెను. క్షణకాలములో శ్రీ అరవిందుని పేరు సమస్తజాతి యొక్క పెదవులపైనను నడయాడ దొడగెను, భరత ఖండము యొక్క నలుదెసలనుండియు ప్రశంసలు, అభినందనములు ప్రతిధ్వనింప సాగెను. స్వర్గీయ టాగూరు కవియు అతని కభినందనములు వెల్లడించెను. రాష్ట్రీయ ప్రధాన దండనాధికారి శ్రీ అరవిందుని నిర్దోషిగా నిర్ణయించుచు తీర్పు చెప్పెను.
1907 లో, లోకమాన్య బాలగంగాధర తిలకు యొక్కయు, శ్రీ అరవిందుని యొక్కయు నాయకత్వములో నడచు జాతీయ పురోగాములకును, మితవాదులకును మధ్యగల ఆదర్శ విషయకములయిన భేదములు అంతకంతకు ప్రస్ఫుటములు కాసాగెను. 1907లో సూరతు కాంగ్రెసులో, తుదకీ వైషమ్యములు ఒక పరిణతరూపము నొందెను. సూరతు కాంగ్రెసునుండి అరవిందుడు వాస్తవమునకు యావద్భారత నాయకుడుగా వెలువడెను. అప్పటినుండియు ఇతనియందు జనతకు శ్రద్ధాభక్తులు. లక్ష్య గౌరవములు, నమభావము ఇనుమడించెను. వెడలిన చోట నెల్ల ఇతడు మహారాజొచితమయిన గౌరవ ప్రపత్తులను పొందుచుండెను. తిలకు,లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాలు మున్నగు మహనీయులతో సరాసరిగా చేతులు కలిపి ఇతడు పనిచేయదొడగెను,
రాజకీయ సిద్ధాంతములు :- శ్రీ అరవిందుడు వంగదేశములో తేజోవంతమును, ఆత్మశక్తి సంపన్నమును అగు ప్రయత్నముయొక్క జ్వాలను రగుల్కొలిపి దానిని విద్యుదుజ్జ్వలితము గావించెను. చాలావర కతడు గాంధీ మహాత్ముని రాజకీయ చర్యా విధానములను, ముఖ్యముగా సాత్విక నిరోధమును, అతనికంటె ముందుగనే ప్రవేశ పెట్టెను. దేశములో నిద్రాణములై యున్న ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పెను. కాని, గత్యంతరము లేనిచో "దౌర్జన్యమును ప్రయోగించికూడ స్వేచ్ఛనుపొందు హక్కు జాతికి కలదను స్వాభిప్రాయమును ఆతడెన్నడును దాచియుంచలేదు. శ్రీ అరవిందుని ఈ భావము లోకమాన్యతిలకు యొక్క భావముతో తుల్యమైనదిగా నుండెను. "అత్యున్న తాదర్శములో 'శాంతి' ఒక భాగము; కాని, అది ఆధ్యాత్మికముగాని, కనీసము మానసికము గాని అయిన మూలము పై ఆధారపడియుండవలెను. మానవ స్వభావము మారనిచో శాంతిమార్గ మేమాత్రము ఫలప్రదము కాజాలదు. జనులు శాంతిమార్గమును ఒక మానసిక సూత్రముగాగాని, అహింసాతత్త్వముగాగాని అనుష్ఠింప బూచిననాడు అది అపజయమును పొందును.