Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవిందుడు


ధ్యాయుడు అరవిందునికి స్వయముగా గ్రీకుభాషను బోధింప మొదలిడెను. సత్వరముగ ప్రధానోపాధ్యాయునిచే ఉన్నత తరగతులలో ఆరవిందునకు ప్రవేశము కల్పింపబడెను. ఇట్లు అరవిందుడు బాల్యముననే గ్రీకు, లాటిన్ భాషలలో పాండిత్యము సంపాదించుకొనేను. పిదప లండనునందలి కింగ్స్ కళాశాలలో ప్రవేశించెను. అచ్చట అతనికి సంవత్సరమునకు 80 పౌనుల చొప్పున విద్యార్థి వేతనము లభించేను.

ఆంగ్ల సారస్వత మండలి పద్యకవితను, కల్పనాత్మక వాఙ్మయమును, ఫ్రెంచి సారస్వతమును, ఐరోపా యొక్క ప్రాచీన - మధ్య - ఆధునిక యుగముల చరిత్రమును చదువుటయందు అరవిందుడు ప్రత్యేక శ్రద్ధను వహించెను. కింగ్స్ కళాశాలయందు గ్రీకు, లాటిను భాషలలో పద్య రచనా విషయమున సంవత్సరమునకుగల బహుమతుల నన్నింటిని అతడు పొందెను. 1895 సంవత్సరములో గ్రీకు, లాటిన్ భాషలలో ఉత్కర్షావధిక అంకములను కూడ అతడు పొందెను. పిదప ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షయందు ప్రతిష్ఠతో ఉత్తీర్ణుడయ్యెను. కాని, ఆ విషయమున అతనికి సహజమైన అభినివేశము లేదయ్యెను. అందుచే ఆ బంధనము నుండి విముక్తిని బొందదలచి స్వయముగ ఐ. సి. యస్. పరీక్షను నిరాకరింపక యుక్తి యుక్తముగ గుఱ్ఱపు స్వారియందు తనకు యోగ్యత లేదను విషయమును అధికారుల దృష్టికి తెచ్చెను.

అరవిందుడు ఇరువది సంవత్సరముల ప్రాయముననే అసాధారణమయిన విద్యాయోగ్యతలను గడించుకొనెను. జర్మను, ఇటాలియను మున్నగు ఇతరములయిన ఐరోపా భాషల యందు కూడ అతడు గొప్ప ప్రావీణ్యమును పొందెను. సంగ్రహముగా చెప్పవలయునన్న అసంఖ్యాకములయిన పాశ్చాత్య సంస్కృతి నిధానములను స్వవశ మొనర్చుకొనుటకు అవసరమయిన ఉత్తమ జ్ఞాన సాధనములను అతడు ఆర్జించెను.

తండ్రి యొక్క ఆర్థిక దౌర్బల్యమును బట్టి అరవిందుడు ఉద్యోగ సంపాదనము కొరకు యత్నింపవలసి వచ్చెను. ఇంతలో బరోడా మహారాజు ఐన స్వర్గీయ శ్రీ సాయాజీ రావు గాయక్వాడ్ ఇంగ్లండునకు వచ్చుట తటస్థించెను. అయ్యవకాశమును పురస్కరించుకొని జేమ్సుకాటను సహాయమున అరవిందుడు గాయక్వాడ్ తో పరిచయమును ఏర్పరచుకొనెను. ఇంగ్లండులో నుండగనే అరవిందునిచే ఆంగ్లములో రచింపబడిన పద్య సముదాయము అతడు భారత దేశమునకు వచ్చినతోడనే పుస్తకరూపమును ధరించెను. అరవిందుడు రచించిన కావ్యములలో మిర్లిటా గీతములు, విషాదాంత ప్రేమ అనునవి పేర్కొనదగినవై యున్నవి. బరోడాలో రాజకీయోద్యోగిగను, కళాశాలాచార్యుడుగను ఉన్నపుడు అరవిందుడు బహువిధములగు సారస్వత రచనలను కావించెను.

రాజకీయ జీవితము  : మొట్టమొదటి నుండియు వ్యక్తిగత మోక్షము గాని, వ్యక్తి సంపత్తిగాని, శ్రీ అరవిందునకు ఉన్నత లక్ష్యముగా తోచలేదు. మిక్కిలి అవమానకరమగు సేవా ధర్మమునుండియు, అజ్ఞానాంధకారము నుండియు, స్వదేశీయులను విముక్తులను ఒనర్చుటకై యత్నించుట తన ముఖ్య కర్తవ్యముగా అతడు గుర్తించెను. తన పేరు వెల్లడించకుండ ప్రజాపత్రికలలో రాజకీయ విషయములను గురించి అతడు వ్రాయుచువచ్చెను. 1902 మొదలుకొని శ్రీ అరవిందుడు రాజకీయాందోళనములలో ప్రవేశించుటకై యత్నించెను. రాజకీయ చర్యలకై సంఘములను నిర్మించుటకు ఉద్యుక్తులైయున్న పురోగాములగు నాయకులతో అతడు చేతులు కలిపెను. బహిరంగముగా ఆతడు చేయగలిగినది తక్కువగా నుండెను. ఈ రహస్య రాజకీయ సంస్థ యొక్క కార్యక్రమమునందు స్వరాజ్య సంపాదనము, విదేశవస్తు బహిష్కరణము, స్వదేశోద్యమము అనునవి ప్రధానలక్ష్యములై యుండెను. స్వరాజ్యమనగా శ్రీ అరవిందుని దృష్టిలో మితవాదుల భిక్షుక విధానము కాదు. సంపూర్ణ స్వాతంత్య్రమే జాతీయ సంస్థ యొక్క ప్రధానలక్షము కావలయు నని అతడు విశ్వసించెను.

లార్డుకర్జను యొక్క వంగవిభజన రూపమైన దురహంకార చర్య వంగదేశము నంతటిని ఏక ముఖముగ కలవరపరచెను. ఈ వంగదేశ విభజన విషయకమైన శాసనము రద్దగువరకు పోరాటమును సాగించుటకై నిశ్చయింపబడెను. 1905 వ సం॥రం అక్టోబరు 16 వ తేది ఉపవాసములతోను, శోకములతోను, ప్రతీకార సూచకమగు దినముగా జరుపబడెను. శ్రీ అరవిందుడు