అన్నజీవ పరివర్తన వ్యాధులు
కీళ్ళలోను అరచేతి కీళ్ళలోను సోడియం యూరేటు చేరి కుంటితనము ఏర్పడవచ్చును. తీవ్రపరిస్థితిలో టించర్ కాల్ సీకమును ఇచ్చిన యెడల అది నొప్పిని పోగొట్టును. మున్ముందు ఈ వ్యాధి రాకుండుటకు రక్తమూత్రామ్లము పెరుగకుండ చూచుట అవసరము. వారమునకు 3, 4 సార్లు సింకోవేన్ మాత్రలను సేవింపవలెను. ఇది చాల విషసంబంధమైన ఔషధము కావున దీని నుపయోగించుటలో మెలకువ అవసరము.
అతి స్థూలత : ఈ పరిస్థితి ఈ క్రింది సందర్భములలో వచ్చును. (1) పిట్ విటరీ మాంసగ్రంథి వలనను (2) థైరాయిడ్ మాంసగ్రంథిలో ద్రవము తగ్గుట వలనను (3) ఓవరీస్ అనగా స్త్రీలకు రజస్సు ఆగుటవలనను. కాని సామాన్యముగా అతిస్థూలత అతిగా తినుటవలన వచ్చును. రోగి ఆహారమును మిగుల తగ్గించు కొనుచు తన శరీరమందలి క్రొవ్వును వ్యయపరచుకొనుచు అదనపు బరువు తగ్గునట్లు యత్నము చేయవలెను. యాంపిటమిన్ గోలీలు తీసికొన్నచో మితిమీరిన ఆకలి ఉండదు. వంకాయలు, టొమేటోలు మొదలగు కూరగాయలను ఉపయోగించినచో అవి తక్కువ కెలో రీల (Calories) ఆహారము నిచ్చుటచే స్థూలత తగ్గుటకు అవకాశమున్నది.
క్రొవ్వు యొక్క ఆహారజీవ పరివర్తనము నందలి అక్రమములు :- ఇందు గాచర్సు వ్యాధి సాధారణమైనది. ఇందు ప్లీహము, కాలేయము మొదలగు అవయవములు క్రొవ్వు కణములతో నిండును. నీమన్ ఫిక్స్ వ్యాధియు, స్కుల్లరు వ్యాధియు ఇట్టివే. కాని నిలువయుండు క్రొవ్వుపదార్థములలో తేడా కలదు. ఇందులకు గల కారణము తెలియదు.
మిశ్రితాహారము (మిక్సెడ్ డైట్) : మనము దినచర్యలో శక్తిని వ్యయింతుము. మన ఆహారమునందలి కెలోరీలు దీనిని సరఫరా చేయును. పెరిగెడు పిల్లలకు ఎక్కువ ఆహారము అవసరము. శరీరము యొక్క ఒక్కొక్క పౌను బరువునకు కనీసము ½ గ్రాము మాంస కృత్తులు కావలెను. పాలలోను, జంతువుల మాంస కృత్తులలోను జీవసంధాయకములగు జంతుక ఆమ్లములు గలవు. పిండిపదార్ధములు, మాంసకృత్తులు, గ్రామునకు 4 కెలోరీల శక్తిని ఇచ్చును. క్రొవ్వు గ్రాము 1కి 9 కెలోరీల శక్తిని ఇచ్చును. పిండిపదార్థములు లేని క్రొవ్వు, కీటో సెస్కు కారణమగును. కావున మన ఆహారము మిశ్రముగా నుండవలెను. అందు పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వు, లవణములు, విటమినులు, కూరగాయలు, ఉన్నప్పుడే సరియగు శక్తి లభించును. మనదేశమునందు కేవలము బియ్యమునే తినెడు వారికి మాంసకృత్తులు తక్కువగా లభించును. శాకాహారులకు మాంసకృత్తులు ఇంకను తక్కువగా లభించును. పాలద్వారమున ఈలోటును కూడా తీర్చుకొనవలెను. సామాన్య మానవునకు సగటున రోజునకు 2500 - 3000 కెలోరీల ఆహారము కావలెను. శ్రమించు కార్మికునకు రోజునకు 4000 కెలోరీల ఆహారము కావలెను. కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా తినిన యెడల వాటి మూలమున ఆహారమున సెలులోస్ అను పదార్థము లభించి మలబద్ధకము తగ్గిపోవును.
నిరాహారత (స్టార్వేషను) : నిరాహారులకు అన్న జీవ పరివర్తనక్రియ యావత్తును తలక్రిందగును. శరీర మందలి క్రొవ్వు నిలువలు వ్యయమగును. పిండిపదార్థములు, క్రొవ్వు మండిపోవుటచే కెటోసెస్ వ్యాధి వచ్చును. మూత్రములో ఎసిటోన్ పదార్థములు కాననగును. క్రొవ్వునుండియు ఆమినో ఆసిడునుండియు గ్లూకోసు తయారుచేయు శక్తి కాలేయమునకు కలదు, కాని ఈశ క్తి పరిమితమైనది. నిరాహారతవలన రోగియైన వ్యక్తికి హఠాత్తుగా సంపూర్ణాహారము నిచ్చుట ఎంత ప్రమాదకరమో ఇటీవల యుద్ధకాలములో వంగదేశ క్షామము రుజువుచేసినది. అందువలన అతడు తప్పక మరణించును. అతనికి మొదట గ్లూకోసునీళ్ళు, ఉప్పు, నీళ్లుకలిపిన పాలు, పండ్లరసము ఇచ్చి, అతని జీర్ణశక్తి పెంపొందిన పిమ్మట మెలమెల్లగా క్రమక్రమముగా అతని ఆహారమును అధికము చేయవలెను.
దీర్ఘకాలముగ అసంపూర్ణ ఆహారముపై బ్రతికిన వానికి రక్తములో మాంసకృత్తులు తగ్గిపోవును. అందు వలన శరీరము వాచిపోవును. వైటమిన్ లోపమువలన పాండురోగము కలుగు రోగముల చిహ్నములు కానవచ్చును. మాంసకృత్తుల అభివృద్ధికి, రక్తవృద్ధికి లివర్