అధికార పరావృత్తి - అధికార విభజనము
అధికార విభజనమే గాన, వాటిని అధికార విభజనము పేర వర్ణింపవచ్చును.
ప్రాముఖ్యము : రాజ్యపరిపాలనలో అధికార విభజనము అతిప్రాముఖ్యముకలది. అది సక్రమముగ నున్నచో పరిపాలన సుష్ఠు (efficient) గా సాగును, ప్రజలకు స్వేచ్ఛ (liberty) లభించును. లేనిచో ఈ పరమ ప్రయోజనములకు భంగము కల్గును. కావున పైన సూచించిన రెండు అధికార విభజన పద్ధతులను సరిగా బోధచేసికొని, అవలంబించుట ఆవశ్యకము.
అధికార పరావృత్తి లేక విభజనము (Separation of Powers); అర్థము : ప్రభుత్వమునకు గల అధికారములు ముఖ్యముగ మూడు రకములు. అవి శాసననిర్మాణము (Law making), కార్యనిర్వహణము (Law enforcing), న్యాయనిర్ణయము (Law interpreting). వీటిలో ఒక్కొక దానిని ఒక్కొక ప్రభుత్వ అంగము (లేక శాఖ లేక భాగము) నిర్వహించును. అనగా శాసన నిర్మాణమును శాసనసభయు (Legislature); కార్యనిర్వహణమును కార్యనిర్వాహక వర్గమును (Executive); న్యాయ నిర్ణయమును న్యాయస్థానమును (Judiciary) నిర్వహించును. ఇట్లు మూడు రకములైన అధికారములును మూడు ప్రభుత్వభాగముల మధ్య విభజింపబడి, వాటిచే ప్రత్యేకముగ నిర్వహింపబడు పద్ధతిని అధికార విభజనము అందురు.
పుట్టు పూర్వోత్తరములు : అరిస్టాటిలు మొదలు నేటి వరకు పెక్కుమంది రాజనీతిశాస్త్రజ్ఞులు అధికార విభజనము యొక్క స్వరూప స్వభావములను వివిధరీతుల తీర్చిదిద్దిరి. వీరిలో 18 వ శతాబ్దమున ఫ్రాన్సు దేశము నందున్న మాంటెస్క్యూ ప్రముఖుడు.
మాంటెస్యూ సిద్ధాంతము: అధికార విభజనము విశేష వ్యాప్తిలోనికి వచ్చినది మాంటెస్క్యూ పండితుని వలన గాన, అతని సిద్ధాంతమును కొంతవరకు ఇచట విచారింతము. శాసననిర్మాణము, కార్యనిర్వహణము, న్యాయ నిర్ణయము అను మూడు రకములైన అధికారములును మూడు ప్రత్యేక ప్రభుత్వ భాగములమధ్య స్పష్టముగ విభజింపబడి, ఆయాభాగములచే ప్రత్యేకముగను, స్వతంత్రముగను, నిర్వహింప బడవలెను. అపుడే ప్రజలకు స్వేచ్ఛ సిద్ధించును. ఇదే అతని సిద్ధాంత మందలి సారాంశము.
మాంటెస్క్యూ సిద్ధాంతమందలి లోపములు : తన సిద్ధాంతమునకు నిదర్శనముగ మాంటెస్క్యూ ఇంగ్లండు నందలి పాలనావిధానమును పేర్కొనెను. అయితే, ఇంగ్లండునందు ఆతని కాలమునగాని, తరువాతగాని, ఆతడనుకొనిన అధికార విభజనములేదు. పార్లమెంటరీ విధానము (parliamentary System) నందు, శాసనసభయు, కార్యనిర్వాహక వర్గమునకు చెందిన మంత్రివర్గమును, విడిగా నుండక కలిసి మెలిసి యుండును. అయినను ఇందువలన స్వేచ్ఛా జీవనమునకు భంగము కలుగదు. పై రెండు శాఖలును ప్రత్యేకముగ నుండునట్లు ఏర్పాటుచేయబడిన అధ్యక్ష విధానము (Presidential System) నందుగూడ విభజనమునకు తోడుగ కొంత సమన్వయము (Co-ordination) ను పాటింపక తప్పలేదు. ఇక కార్యనిర్వహణ, న్యాయనిర్వహణ శాఖల మధ్యగూడ విభజనము మాత్రమే గాక కొంత పరస్పర సంబంధముండుటయే శ్రేయస్కరమని అమెరికా, ఇంగ్లండు, దేశములలోని న్యాయ నిర్వహణ విధానములు వ్యక్తము చేయును.
ఇంతకు తేలినదేమనగా - స్వేచ్ఛ, మాంటెస్క్యూ నిర్ణయించినట్టి అధికార విభజనము మీద మాత్రమే ఆధారపడి యుండదు; అధికార విభజనమునకు తోడుగ సమన్వయము గూడ కొంతవరకు స్వేచ్ఛకు దోహదముగ నుండును. అధికార విభజనము గతకాలపు నిరంకుశ ప్రభుత్వము (Despotic Government) నందలి పరిస్థితులకు సరిపడునంతగా నేటి ప్రజాప్రభుత్వము (Democratic Government) నందలి స్థితిగతులకు వర్తించదు.
మాంటెస్క్యూ సిద్ధాంతమందలి గుణములు : పై విమర్శనము, మాంటెస్క్యూ పండితుడు అధికార విభజనము పూర్తిగా నుండవలెననియు, ఆ యధికారములను చలాయించు ప్రభుత్వశాఖలు పూర్తిగా ప్రత్యేకముగ నుండవలెననియు, వాటిమధ్య సహకారము ఉండగూడదనియు, నిర్ణయించెనను ఊహపై ఆధారపడియున్నది. అతడు అట్లే అభిప్రాయ పడెనా లేదా అనునది వివాదగ్రస్తమైనది. కొందరు పండితులు అతడు ప్రభుత్వశాఖల మధ్య పూర్తి విభజనమును కోరలేదనియు, కొంతవరకు