Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతర్వేది


పడు రాజ్యము లీన్యాయస్థానము యొక్క మధ్యవర్తిత్వము నపేక్షించిన యెడల న్యాయాధీశులు తమ అభిప్రాయములను వ్యక్తపరచుచుందురు. అంతర్జాతీయ న్యాయశాస్త్రమును గురించి సమితికి సంబంధించిన అంగములు సలహాలను కోరినయెడల అట్టి సలహాల నొసగుటకిది సంసిద్ధ ముగనున్నది.

ఐక్యరాజ్యసమితి కార్యములన్నియు మూడు ప్రధాన సూత్రములతో సమన్వయము కావలసియున్నది. అది తలపెట్టు కార్యమేదియు రాజ్యముల సర్వస్వామ్యమును (Sovereignty) నిరోధించునదిగ నుండరాదనునది మొదటి సూత్రము. ఎట్టి పరిస్థితులలో కూడ ఏరాజ్యము యొక్క ఆంతరింగిక (Domestic) వ్యవహారములలోను సమితి జోక్యము కలిగించుకొనరాదనుట రెండవసూత్రము. అగ్రరాజ్యము లైదింటి యొక్క అంగీకారమును పొందిన గాని శాంతిభద్రతల స్థాపించుటకు కావలసిన కార్యములను సమితి కార్యనిర్వాహక సభ యగు భద్రతా సంఘము చేయరాదనుట మూడవ సూత్రము. ఇట్టి సమన్వయము కుదురుట సులభసాధ్యముగా కనబడుటలేదు. అయినను,సమితి ఆదర్శసిద్ధికై అందరు చిత్తశుద్ధితో కృషి సలుపుట ప్రపంచ క్షేమమున కవసరము.

మా. వెం. రం-


అంతర్వేది:- ఆంధ్ర దేశమును పవిత్రము గావించు గోదావరీనది రాజమహేంద్రవరమునుండి, కాశ్యప(తుల్యభాగ), అత్రి (కోరింగనది), గౌతమి, భరద్వాజ,కౌశిక, జమదగ్ని, వశిష్ఠ అను ఏడుపాయలుగా చీలి సముద్రముతో సంగమించుచున్నది. వీటిలో భరద్వాజ. జమదగ్నిపాయ అంతరించినవి. కౌశిక, తుల్యభాగలు చిన్న కాలువలవలె నున్నవి. యాత్రికులీ సప్తసంగమ స్థలము లందును స్నానముచేయుటకు "సప్తసాగర యాత్ర" చేయుదురు. వీటిలో మిక్కిలి పడమటిది వసిష్ఠాసాగర సంగమము. ఇచ్చట వసిష్ఠపాయకు ఎడమఒడ్డున అంతర్వేది క్షేత్రమున్నది. ఇది నరసాపురమను ప్రాచీన చారిత్రక పట్టణమునకు ఏడుమైళ్ళ దూరములోనున్నది. క్రీ.శ. 1602 వ సంవత్సరమున పోలెండు దేశస్థులగు డచ్చివారు ఈప్రాంతమునకు ఓడవర్తకము కొరకు వచ్చిరి. మన ర్తకముకొరకు దేశస్థులు హాలెండువారిని వలందువారు అనుచుండిరి సముద్రములోనిల్చిన వలందుల ఓడలనుండి గొప్పపడవలు అంతర్వేది మీదుగా నరసాపురమునకు జేరుచుండెను. ఓడలకు మార్గసూచనకొరకు డచ్చివారు అంతర్వేదిదగ్గర ఒక గొప్ప స్తంభమును కట్టిరి. ఇది దీపమున్న స్తంభము కాదు. పెద్దఓడలు ఒడ్డునకు రాకూడదని హెచ్చరిక తెల్పుటకీ స్తంభము పయోగించెడిది. ఈ ప్రాంతమును పిమ్మట ఆక్రమించుకొన్న ఆంగ్లేయులీ స్తంభమును బాగుచేయించిరి. 1951 వ సంవత్సరమున ఆగస్టులో వచ్చిన ఉప్పెనలో ఈ స్తంభపు పై భాగము పడిపోయినది. అప్పుడు సముద్ర మించుమించుగ నొక మైలుదూరము భూమిమీదికి చొచ్చుకొని వచ్చినది. పూర్వము సముద్రజలమున కరమైలు దూరముననుండెడి యీ స్తంభమిప్పుడు సముద్రములో నున్నది. దీనికి కొంతదూరములోనుండెడి ఆంజనేయ స్వామి ఆలయమునుగూడ సముద్రుడు మ్రింగివేసినాడు. ఆలయము కూలిపోయినది. ఆంజనేయ విగ్రహము అంతర్వేది చెరువుగట్టున నొక ఇటుకగుడిలో భద్రపరుపబడినది.

ఈప్రదేశమున కృతయుగమున బ్రహ్మ నూరేండ్లు యాగముచేసి యజ్ఞశాలలో అంతర్వేదికా స్థలమున నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి క్షేత్రపాలకుని గావించెను. పిమ్మట వసిష్ఠ మహర్షి యిట నాశ్రమమేర్పరచుకొని గోదావరి నుండి వసిష్ఠపాయను తీసికొనివచ్చెనట. హిరణ్యాక్ష పుత్రుడగు రక్తలోచనుడు ఈశ్వరవర గర్వమున కన్నుగానక, విశ్వామిత్ర ప్రేరితుడై వసిష్ఠపుత్రులను చంపగా, వసిష్ఠుడు విష్ణువును ప్రార్థించెను. హరి, లక్ష్మీనృసింహ రూపమున మునికి ప్రత్యక్షమై, మాయాశ క్తియు తన సోదరియునగు అశ్వారూఢాంబ (గుఱ్ఱాలక్క) రాక్షసుని రక్తము భూమిమీద బడకుండ దననాల్కతొ పీల్చి వేసి తోడ్పడుటవలన, రక్తలోచనుని సంహరించెను. పిమ్మట రాక్షసరక్తమును గుఱ్ఱాలక్క విడిచివేయగా నది రక్తకుల్యయను పేరున ప్రవహించెను. వసిష్ఠుని ప్రార్థనచే లక్ష్మీనృసింహస్వామి అర్చారూపమున నట నిల్చిపోయెను. వసిష్ఠుడు లక్ష్మీ నృసింహ విగ్రహమును ప్రతిష్ఠించి అర్చాదులు గావించెను. ఈస్థలమునకు కొంతదూరమున రక్షణగా ఆంజనేయస్వామినిగూడ వసిష్ఠుడు ప్రతిష్ఠించెను. అస్వామి ఆలయమే 1951 లో సముద్ర గర్భమునపడేను.