పుట:శ్రీ సుందరకాండ.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 25


              5
మందవిడిచి వనమధ్యమందు తో
డేళ్ళ గుంపున బడిన లేడిపగిది
ఒడులంతయు లోనొదుగ ముడుచుకొని
వణకుచుండె నతిభయమున మైథిలి.
              6
పొడుగుసాగి పువ్వుల గుత్తులతో
శోభిలుచున్న అశోకశాఖ అవ
లంబనముగ వల్లభుని స్మరించుచు
మనసు గాయపడ మ్రగ్గుచు నుండెను.
              7
అంతుకనబడని అష్టకష్టముల
నడిసముద్రమునబడి శోకింపగ,
కనుదోయిని పొర్లిన జలములతో
స్నానమాడె జానకి సుస్తనములు.
              8
రక్కసులటు లూరక వేధింపగ
ఛిన్నచిత్తయై విన్నబాటొఱయ,
భీతభీతయై సీత శోభిలెను,
సుడిగాడ్పుల కీడ్వడిన కదళివలె.
              9
కాతరమతియై కంపించిన వై
దేహి వెన్నునన్ దీర్ఘదీర్ఘముగ
వ్రేలుకాడె ముడివిచ్చినజడ; పొద
లాడుచున్న కాలాహిచందమున.
              10
శోకవేగమున సొగయగ చిత్తము,
నిట్టూర్పులు ఘూర్ణిల్ల, నార్తయై
విలపించుచు మైథిలి, వెడదకనుల
వెళ్ళబోసె కన్నీళ్ళు కడవలను.

210