పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


బహుళ విద్వద్బృంద పరిషదర్చిత పుష్ప
            మాలా మనోహర మహితమూర్తి
తేజంబు నెఱపు జ్యోతిశ్శాస్త్ర విద్యాంగనా
            నవ్య రుచిర భావానువర్తి.
            
గీ॥ శిత శతవధాన హర్షితా స్థాన దత్త
   కనక జయఘంటికా సింహ కంకణ రవ
   ముఖరితాశాంతసద్యశఃపూర్తి, సుకవి
   సింహ బిరుదుండు వేంకట శేషశాస్త్రి.
    
క॥ చనుదెంచి నన్నుఁ గవి వం
   దనమని వచియించి విలువఁ దమ్ముఁడ రాద
   మ్మని కౌఁగిఁటఁజేరిచి చెం
   తను నేఁ గూర్చుండుమన నతఁడు కూర్చుండెన్.
   
గీ॥ స్వాంతమునఁ బొంగి పొరలెడు హర్షభరము
   వికసిత ముఖాబ్దములపైన వెల్లివిరియ
   మాటలాడితి మలపును మలపులేని
   కుశల సంప్రశ్నములఁ గూర్చి కొంతతడవు.
   
చ॥ చిఱునగ వాస్యసీమ వికసింపగ వేంకటశేషశాస్త్రి “సో
    దర! మును నన్నయాది కవి తల్లజులెల్ల పురాణసంతతుల్
    సరస పదార్ధ భావ గుణ సంభృతమై తగు మంచి శైలిలో
    విరచన చేసియుండి రవి విశ్వజగన్నుతమై తనర్చెడున్. 15

క॥ పిదపఁ బురాణాంతర్గత
   విదిత వివిధకథలు గొనుచుఁ బెద్దన్నాదుల్
   పదునెనిమిది వర్ణణములు
   గదియించి రచించి రఖిల కావ్య శ్రేణుల్ 16
   
ఉ॥ కాలముకొంత యిప్పగిదిఁ గావ్యయుగంబుగ సాఁగె ; దానిలోఁ
    బూలవనంబు అయ్యమృతపున్ నెలయేఱులు నిగ్గుటాణి ము
    త్యాల బెడంగు మేల్గొ డుగులచ్చపు వెన్నెల సోగలో యనన్
    జాలిన మేటికావ్యము లసంఖ్యముగా జనియించె వ్రేల్మిడిన్.17