పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


ఉ॥ ఆవలఁ గొన్నినాళ్లరుగ నంతట నంతట సారవంతమౌ
    త్రోవలు తప్పి కాంతిచెడి దుర్గము దుర్గములట్లు భీకరా
    శీవిషమున్న పేటికల చెల్వునఁ గాననరాజ మాడ్కిఁగా
    వ్యావళులున్ వికాసగుణమంతయుఁ గోల్పడె బీడువోవుచున్.
    
క॥ పెక్కామడ కొక్కఁడుగా
    నక్కడలిని గల్గు దీపులట్టులు కైతల్
    చక్కఁగ లిఖించి వార్గల
    రిక్కాలంబునను నొక్కరిరువురు పెద్దల్.
    
మ॥ ప్రతిభా పూజ్యులు వారు వ్రాసిన మహాగ్రంధంబు అత్యంత పు
     ణ్యతమంబుల్ గద' వాని నట్లునిచి యన్యగ్రంధముల్ చూచినన్
     మితియో మేరయొ యేమన్ వలయు స్వామీ వద్దు చాల్ చాల్ సర
     స్వతికిన్ వాఁతలు పెట్టినట్లలరుఁ 'బాపం శాంత' మిప్పట్టునన్.
     
చ॥ యతులు వనాళిఁ, బ్రాసములు నాయుధశాలల, లక్షణంబు ల
     శ్వతతి, రసంబు వైద్యుకడఁ బాకము వంటలలోన, నయ్యలం
     కృతులు బడంతులందు, మఱి రీతులు రోఁతల, శయ్య మేడ, ని
     ట్లతికిన కావ్యముల్ గనిన నయ్య యొడల్ దహియించినట్లగున్.
     
శా॥ ఈవిన్నాణము లెన్నియేని గల వాయీ యంశముల్ కొంతమే
    రై వర్తించు ముసళ్లపండువది ముందైయున్నదన్ మాడ్కిఁజె
    ల్యై విశ్వం బగలించుచున్నయది యాహా! గ్రాంధిక గ్రామ్య భా
    షావాదంబు క్షణక్షణంబునకు హెచ్చన్ జొన్చే నీ వేళలో.
    
గీ॥ దేశమంతటఁ వాఱు నదీమతల్లి
    వంటిదగు వ్యావహారిక భాష; దాని
    నచ్చటచ్చట దేశంబు నలముకొనిన
    మంచియును జెడ్డయును నాశ్రయించియుండు.
    
ఉ॥ ఊరకభాషలేమిటికి నుత్తమ సంస్థితి గల్గు: దాన సం
    స్కారబలంబు గల్గి యధికారము దాల్చిన ప్రాజ్ఞికోటి దా
    షారచనంబుఁ బూని కృషిసల్పినఁ గల్గెడి; రిక్తులూ వినన్
    బారము ముట్టునే గజము పైఁజవుడోలు ఖరంబు మోయునే.