పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

మ॥ తనసౌజన్యము సజ్జనుల్ పొగడ నిత్యంబు సదాచార వ
    ర్తన మొప్పార, గురుండు దైవమగుచున్ బ్రహ్మోసదేశాది పా
    వనకృత్యంబులు నాకొనర్చిన ఘనున్ బ్రఖ్యాతచారిత్రు మ
    జ్జనకున్ వెంకటరామయార్యు మదిలో సద్భక్తి భావించెదన్.
    
గీ॥ "మాతృదేవోభవ" యటన్న మహితసూక్తి
     మఱువరానిది; నిరతము మజ్జననిని
     దొడ్డ ముత్తైదువను మనస్తోయజమునఁ
     గొలిచెదను సుబ్బమాంబ, సద్గుణకదంబ.
     
మ॥ నను గారామునఁజేర్చి యాంధ్రమున 'నోనామాలు' మెట్రిక్యులే
     షనుపై నాంగ్లము నేరిపించి తనదౌ సర్వస్వ మర్పించి పెం
     చిన కారుణ్యరసార్ద్రమానసుఁడు మా చిన్నయ్య ‘సంజీవరా
     యని దుర్భాకకులాబ్ధిసోముని మది ధ్యానింతు నెల్లప్పుడున్
     
గీ॥ భారతీనాధు నపరావతారములనఁ
     గావ్యజగము సృష్టించి లోకములు మనువు
     నన్నయాది కవీంద్ర మందారతరుల
     నాంధ్రభాషాగురుల నిత్యమభినుతింతు.
    
గీ॥ ప్రకృతితత్త్వరహస్య సర్వస్వ మెఱిఁగి
      నవనవోన్మేషమైన ప్రజ్ఞయుఁ దనర్పఁ
      గృతులు విరచించి లోకోపకృతులు పెంచు
      నార్య కవికోటి నిత్యవిద్యార్ధిగణము.
      
గీ॥ నూతనోజ్జీవమిచ్చు ప్రాభాత దక్షి
     ణానిలము సోకఁగా మేడపైన “టాడ్డు"
     దొర రచించు రాజస్థాన చరిత మెత్తి
     యొక్కనాఁడేను జదువుచు నున్నయపుడు.”
     
సీ॥ సంస్కృతాఖండ భాషాకావ్య సాహిత్య
            సామ్రాజ్య సర్వస్వ చక్రవర్తి,
     యఖిలాంధ్రభాషా మహాకావ్యవిరచన
            వ్యంగ్యవైభవ పట్టభద్రకీర్తి,