పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


     ద్వారంబందునఁ జేసె శాత్రవ కులధ్వంసంబు మాతండ్రి యా
     వీరాగ్రేసర చక్రవర్తి యడుగుల్ వేయేండ్లు సేవించెదన్. 150 150
     
మ॥ పదివేల్ వీరుల బాహుశౌర్య యుతుఁడీబాలుం డటం చెన్నఁగాఁ
    గదనం బెచ్చట భీమమౌ నచటఁ జక్కన్ ప్రాలి దుర్దాంత శ
    త్రు దళచ్ఛేదము చేసి నిన్ను జయయుక్తున్ జేయ యత్నింతు నీ
    బదనూర్ సింహము తేజసింహము నుడుల్ వ్యర్ధంబుగాకుండుతన్. 151
    
శా॥ నింగిన్ ముట్టెడు కోటకొమ్మగుములున్ దేవాలయమ్ముల్ జయో
    త్తుంగ స్తంభము లొప్ప స్త్రీపురుషు లెందున్ బుత్రపౌత్రాప్తి నొం
    దంగా మాదృశభూపతుల్ కొలువునన్ ద్వత్పాదముల్ మోయఁగా
    సింగారించిన తేరి యట్లలరు నా చిత్తూర్పురిన్ గాంతునే. 152
    
మ॥ అని వాక్రుచ్చి హృదంతరాళమున వీరావేశ ముప్పొంగ వి
    చ్చిన కెందామరలైన కన్నులతుదిన్ జెన్నారు రేమంచు దొ
    ట్టన నొక్కశ్రుకణంబు జాఱఁగను వీరాగ్రేసరుం డుండె వె
    న్కను గూర్చుండిన గ్వాలియర్విభుఁ డనంతత్యాగసంశోభియై. 153
    
 -: రామచంద్రదేవుఁడు తన మనోగతము దెలియఁజేయుట. :-

సీ॥ దరిలేని జల మగాధ స్థాయి వెలుఁగొందు
                కడలికి నొకతోయ కణమునట్లు
    బ్రహ్మాండ మంత గొప్పగనున్న పెనుసైక
                తాద్రికి నొక చిన్నయణవు నట్లు
    శాఖాచయంబు దిశాకోణములఁ బ్రాకు
                నవనీజమున కొక్క యాకు నట్లు
    భూదేవి మకుటమైపొడవు నెత్తున్న ప
                ర్వతరాజమున కొక్క రాయియట్టు
ఆ॥ లేబలంబు లేనియే కాంగి బహువాహి
    నీశు నీకు సాయమేమి సేతు
    హృదయకుసుమ మొక్కఁడే నాడు సర్వస్వ
    మదియె నీపదముల సప్పగింతు. 154