50
ప్రబంధరాజవేంకటేశ్వర
కలధౌత వేత్రపాణుల మునుకొను వింజామరల క్రోవుల యంత్రధారల వలనఁ గలగుండువడు వారును వేఱొక్క దిక్కున కోరనేల కోరనేల యనిపించు వీక నుదురుల నున్నని సన్నపుఁ బూదిరేకలు జందెపువాటుగా నీటుగానఁబడ మెడల వెండి గొలుసుల సజ్జగుసజ్జలు, జవ్వాది మెఱుం గేర్పడఁ గనిపించు పడగల బెడఁగు క్రొమ్ముడులు దాడిమపూవిత్తులపై దాడిమీఱు వీడెంపు బలుకెంపు నింపు పలువరుసలు ముక్కుల తళుకులు పొదలికల నెన్నడల కులుకులు గల బలిజకన్నడ మిటారులు, కుందనపు బిందియల యందంబు క్రిందుపఱచి పచారించి సరిబిత్తరిద్రోయు క్రొంబసపు మిసిమి నిబ్బరపు టుబ్బుసిబ్బెపు గబ్బిగుబ్బలు యపరంజి నక్కులవలె రంజిల్లు మంజరి కాపురూపు చెక్కులు, యలరుటమ్ముల రుటమ్ముల యలరుటమ్ములు చూపుఁజూపువాలిక చూపుచూపులు చికురాకు పొగరు జిగివగ తొగరు నూకుటడుగుల జోడించిన పాలవెండి పాగడమ్ములు మినుమినుకను పెనుమిణుగురుఁ బురువులు గిరికొన్న తాపించ గుచ్ఛంబుల దినుసున నెఱసంజజిగి గురుగింజల మెండుకొను కొండెలు గల చోళవిలాసినులు, పంజులవలె వెలుంగు మానికపు పంజుల కమ్మలు యరికమ్ముల గోరజపు టారజంపు తిలకంబులు కప్పురాల బరణుల యొప్పు రాలజేయు నిడుదవేనలి నూనెముడులు చూచువారి పెదవులకుఁ జవు లొదవించు నాణంపుటాణి సుప్పాణి ముంగురులు గల గుజరాతి హొంతకారులును, మకరధ్వజుని కొంప యొక చెంప జీరుమడిచారలమీఱు జిలుగుటంచు మణుంగు కుడివంకపైటచెఱంగులు పంచబాణుని యర్ధచంద్రబాణంబులన శోభిల్లు నాభినామంబులు చిక్కెంటలఁ జిక్కెడలించిన నూనె నీటు మెఱుంగు కొనవాడి చిలుకముక్కుం గోళదువ్వి పొంకపఱచిన డావంక చెవిగప్పుజాఱు గొప్పుల పూసరంబులు మగల గికురించ కంకణంబులు గట్టినరీతి నత్తమిల్లు పుత్తడి కంకణంబులుగల సాతనిజాతి నీటుకత్తెలాదిగా నేతెంచిన నాయావిలాసవతులు నాలిమగనాలి గుంపులొకరికొకరు కేలుకేలున గీలించి తమతమ చెంగటి కోడెప్రాయంపు గోవాళ్ళకుఁ దిరునాళ్ళచూచు వేడుకలలోఁ బిసికెళ్ళఫలము కల్పించ నుపాయంబు లెంచి తళుకుబెళుకు చూపులసైగల జెదరి బెదరిచూచి చెరువుల మెరుపుల బొల్ప పట్టయిన మేరువులంగట్టిన కదళికా తరు ఫలముల జతగూర్చ పుండ్రేక్షు కాండంబులంగని యవురా చెఱకులఁ బండ్లు బండెన్ గంటిరేయనిన