పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురుషోత్తమమందలి భక్తిసఖునకు భవ్యంబు, చక్రతీర్థమందలి సుదర్శనునకుఁ గుశలంబు, కుంభకోణమందలి శార్ఙ్గపాణికి క్షేమంబు, భూతస్థానమందలి శార్ఙ్గస్వామికి శోభనంబు, కపిస్థలమందలి గజేంద్రవరదునకు నిత్యోత్సవంబు, చిత్రకూటమందలి గోవిందునకు సేమంబు, ఉత్తమస్థలమందలి యుత్తమస్వామికి భద్రంబు, శ్వేతగ్రావమందలి పద్మలోచనునకు బరిణామంబు, పార్థస్థలమందలి పరబ్రహ్మునకు సేవ, కృష్ణకోటయందలి మధుద్విషున కభివృద్ధి, నందిపురియందలి మహానందున కీడితంబు, వృద్ధపురియందలి వృషాద్రిశయునకుఁ బనితంబు, సంగమగ్రామమందలి సంగమస్వామికి రీతంబు, శరణ్యమందలి శరణ్యునకు జయ జయ, సింహక్షేత్రమందలి మహాసింహునకు సమ్మానంబు, మణిమంటపమందలి మల్లారిస్వామికి బహుకరణంబు, నిబడమందలి నిబిడాకారునకు దక్కెదము, ధానుష్కమందలి జగదీశ్వరునకు లెంకల మయ్యెదము, మాహురమందలి కాలమేఘునకు బంటుల మయ్యెదము, మధురయందలి సుందరరాజస్వామికి భక్తి చేసెదము, వృషభాద్రియందలి యళఘరికి దాసానుదాసుల మయ్యెదము, వరగుణస్థలమందలి నాథస్వామినిఁ బ్రార్థించెదము, కురకయందలి రమాసఖుని భజించెదము, గోష్ఠీపురమందలి గోష్ఠపతి నుపాసించెదము, దర్భసంస్తరణమందలి శయానస్వామి నాశ్రయించెదము, ధ్వనిమంగళకస్థలమందలి శౌరినిఁ గీర్తించెదము, భ్రమరస్థలమందలి బలాఢ్యునిఁ గొల్చెదము. కురంగస్థలమందలి పూర్ణస్వామి మమ్ము రక్షించుఁగాత, వటస్థలమందలి విష్ణుండు మదీప్సితంబు లొసంగుఁగాత, క్షుద్రనదియందలి యచ్యుతుండు మాదృశుల దయాదృష్టి వీక్షించుఁగాత, అనంతశయనమందలి పద్మనాభుండు మత్తనువులు పావనత్వ మొంద సమకూర్చుఁగాత, వేంకటశైలంబున శ్రీనివాసస్వామివై నూటయెనిమిది దివ్యతిరుపతులయందు నిన్నిరూపుల వెలయుచున్న నీకు ననంతనమస్కారంబు లని పొగడి
కరిమేషమహిషనృమకర
హరిణహయవృషగతియుతులు హరికయమనరా
డ్వరుణకధన్యులు నగు తో
మరిదండ్యుదశిగుణికేతు మద్గతి శూలుల్.