పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/293

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీసంబఁ దీఁటుచుఁ గలంగక తొలంగక తిరుగుడుఁ బడక నైదుఁబది సేయక నీరంబులు చెడక బీఱువోక యోడక యొడ్డిగిలక వేసరక వెక్కసంబు వేడుకగదుర నసమసమరంబున సవ్యమండలముగా నుండినం బుండరీకాక్షుని గింకరులు సాహంకారులై శంకింపక కుడివంక పక్కళంబుగాని మొక్కలంబున డాసి కరాచూరుల ఝాటులు వ్రేసిన భిల్లవల్లభు లత్తెఱంగునకుఁ జిత్తంబు హత్తనీక వడి దరగక పాటింపక యోలంబు జూపక నోసరిలక సడలక సందీక వేగిరపడక జిరచిరబరతెంచక చలింపక చాయదరుగనీక గడిదలలూని ఝళిపించియును తాలించియు మించియుఁ గమ్మియుఁ దేకువయుఁ దెలివియు మదంబును మచ్చరంబును వేరంబును వెరవును తెంపును సొంపును నింపుమీఱఁ బిడుగులు బిడుగులు గదిసిన చందంబున ముఖచాళిబూని వారలపై ధాణుధారలుం జూప నప్పట్టున జుట్ట పిట్టలావు నెట్టెంపుఁ దాలుపు బలగంబు స్వస్థికంబున నొడ్డుకొని తమకంబులఁ గమకించుచు హురుమత్తున తూరి యంపరల పరంపరల వెంపరలాడిన హుసియని దొందడిని పుళిందులు కఱకుమీఱి చుఱుకుచూపులు చూచి యెందుబోయెదరు నిలునిలుడను కూతలు సేసి గడుసుగొన్న గడిదలలు బిఱిందికిఁ జొనిపి మేనులు బయలుగాఁ జూచి గోవిందుని సేవకులు చొరఁగూడక పేరములు బాఱి బారితుపాకులు సంధించిన మేనులు వంచి బొంకించి నాగదత్తుండు తనబలంబుల నెచ్చరించి పరుజులో నెడగండ్ర పిటిపట్టుగా హత్తించి పరుఁజించుపూనికకై పరుజించి తగ్గితగ్గి డగ్గరి డిగ్గనం త్రటిత నాట్యములో సేయు జగ్గునకుఁ దమ్మికంటి బలంబంటు వీడక గంటిమి గంటిమి మేలుమేలని పొగడి గదలని గుడియెడ తెగకం బొడిచి వెంబడి మొలపిణెమ్ములు ఝరన దిగిచి యత్తఱి మిడుక దఱిమిక్రుమ్మిన చెమ్మటజెందక తడబడక బుడిబుడి నడల నొడళ్ళు సోఁకనీకుండ చూచి నిలుచుక కఫాలుకఫాలున చూరణిబడిబడి బెడాలున జొచ్చి బిడాబిడి సరిబిత్తరుల మిడుక దఱిమి హత్తిన కడాకిడి కరంబుల యడిదంబులు బెడిదంబులుగా నొకటొకటరొరసి ఝల్లుఝల్లున మిడుగురల రాలుచు వింజామరల క్రోవుల ఠేవఁ గోల మెఱుంగుల తెఱంగునఁ గోలాటమ్ము లాడు బొమ్మలకైవడి మురహరునకుఁ బురవిజయేందిర రతనంపుటారతు లెత్తిన జోతులరీతిఁ గన్పట్టియుండ గండుమీఱి రెండుతెగల నంబులఁ జలంబుల ద్వంద్వయుద్ధంబునకు సన్నద్ధులై యంతటంతట నందందు