పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxvii

నెప్పటికి పునర్ముద్రణభాగ్యము నొందునో తెలియదుగాన అందలి ప్రధానాంశములునైనను ఇచ్చట తెలుపుట మంచిదని వ్రాయుచున్నాను. “ఈ గ్రంథము నందు బంధకవిత్వ గర్భకవిత్వ చిత్రకవిత్వములు విశేషముగ వ్రాయబడి యున్నవి. ఇందుదహరింపఁబడిన గర్భకవిత్వ చిత్రకవిత్వ బంధకవిత్వములలో 808 వ సీసపద్యమును బోలిన పద్యమిదివఱకు నాంధ్రగ్రంథములలో నెచ్చటను వ్రాయబడియుండలేదు. ఈపద్యమునందు గర్భితములన్నియు నఱువదికిఁ బయిగా నున్నయవి. ఈ యఱువది గర్భితములును రకార ప్రాసఘటితములై యున్న యవి. ఇందుఁ గంధములుగఁ తేటగీతులు, ఆటవెలదులు శోభాన మంగళారతులు, శ్లోకములు, చౌపదములు, వృత్తములు, అష్టకములు ధవళములు, అర్థ చంద్రికలు, ఉత్కళికలు రగడలు, దరువులు, ఉభయభాషాకందములు లోనగు గర్భితములు వ్రాయబడియున్నవి. ఇంతియగాక యీ సీస తేటగీతి యంతయుసర్వలఘువులతో గూర్పబడిఁ యున్నది. వెండియు సీసములలోనుండి వింశతిబంధకందము కూడ వ్రాయబడియున్నది. ముంజేతి కడియమున కద్దమేల? ఇప్పుడీ పద్యము ముద్రింపబఁడి మీ యెదుటఁ బెట్టబడియున్నదిగాన మేము విశేషము దీనింగుఱించి వ్రాయఁబనిలేదు.

“ఇట్టిపద్యమిదివరకుఁ దెలుగు గబ్బములలో నెవ్వరును వ్రాసియుండ లేదు...807, 809, 810, 817, 818. 821, 822,825, 826, 827, 831. 832, 847, 850, 863, 870 లో నగు పద్యములు గర్భితములచే వెలయుట చూడగా నిక్కవిని జతుర్విధ కవితా నిర్వాహకుండని చెప్పుటకు నించుక యైనను సందియములేదు. బంధ కవిత్వ చిత్రకవిత్వాదులకుఁ గొన్ని లక్షణములగపడు చున్నవిగాని గర్భక విత్వాదులకు లక్షణములు బొత్తుగఁ గనిపింపవు. అప్పకవి గర్భకవిత్వమునకు లక్షణమును వ్రాయకనే తాను కొన్ని గర్బితవృత్తములు వ్రాసియున్నాఁడు. ఒక్క చతుర్విధ కందమునకుఁదప్ప మఱి దేనికిని నప్పకవీ యమునందు లక్షణమగపడదు గర్భకవిత్వ చిత్రకవిత్వములు కవియొక్క పాండిత్యాతిశయము పై నెక్కొనినట్లున్న యవి. అట్లుగానిచో పై నుదహరించిన సంఖ్యగల యీ గ్రంథములోని గర్బిత పద్యములు వ్రాయుట కీకవికి లక్షణ మెట్లుండునని యూహజేయగలము. అఱువదినాల్గు గర్భితములు మాత్రము వ్రాయవలసినట్టు లక్షణముండునా? ఉండదు కాబట్టి వారివారి పాండిత్య ప్రగల్భత ననుసరించి గర్భకవిత్వమును వ్రాయవచ్చునని యూహజేయుచున్నారము.