నవోఢాసంగమము
సీ. సాచీకృతాననోజ్జ్వలమందహాసంబు
సకటాక్షతాటంకచకచకంబు
హుంకారకంకణక్రేంకారనినదంబు
స్ఫురితవక్రీకృతభ్రూయుగంబు
కరనిరుద్ధస్తనోపరిభాగచేలంబు
హస్తిద్వయీకృతస్వస్థికంబు
కుంచితాంగక్రియాగుప్తనీవీగ్రంథి
ధీరసంయుతకోమలోరుయుగము
గీ. విలసితస్వేదవదనాబ్జవిలసనంబు
గాఢపులకోద్గమంబును గలుగు సతిని
దొలుత రతిఁ దేల్చె నాగదత్తుండు దనదు
విలువ జవరాలి కూటమిఁ దలఁచి తలఁచి. 720
గీ. అపుడు నిట్టూర్పు నిగుడించి యలరు సజ్జ
నవ్వలవ్వలిమొగమున బవ్వళించి
మెల్లనే చేతిగాజులు ఘల్లు రనఁగ
గృహిణపాదంబు లొత్త నిద్రితుఁడువోలె. 721
క. ఉండునెడ నతని మంచము
దండఁ బదప్రాంత సరణిఁ దన చెఱఁగు మహీ
మండలిఁ బఱచి శయించెను
నిండినప్రేమమునఁ దరుణి నిద్రాన్వితయై. 722
శా. అంత న్లేచి లతాంగి మైదొడవు లాద్యంతంబు సంతోషిత
స్వాంతుండై సతిసేయు భాగ్యవశతన్ జంపం న్దలం పేది వాఁ
డెంతేనిన్ దయలేక పుచ్చుకొని తా నిల్వెళ్ళి యావేళనే
చెంత న్నిల్వక వారకాంతయిలు జొచ్చె న్సిద్ధసంకల్పుఁడై. 723
గీ. చొచ్చి తన నెయ్యురాలికిఁ జూపి దాని
తల్లి పాతరలాడ సొమ్మెల్ల నొసఁగె
దలఁచుకో నేరఁడయ్య మీఁదటి తెఱంగు
నింక నిమ్మన్న నేరి సొ మ్మివ్వఁగలఁడొ. 724
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/276
స్వరూపం
ఈ పుట అచ్చుదిద్దబడ్డది