పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుపెక్కి చెక్కులు వళు లుబ్బుఁగని గౌను
బలసి నెన్నడ దొట్రుపాటుఁ జెంది
చను మొనల్కప్పాని మను దానిపై యాస
గలిగి వేవిళ్ళెచ్చి కనుల నలఁత
గీ. బొడమి యిటుఁ దొమ్మిదినెలలు కడుపుమోచి
మంచిలగ్నమునను నిన్నుఁ గాంచి నామ
కరణ మొనరించి సంతోషకలిత నగుచు
నేటఁ బెంచిన దానిని న్బూటఁబెంచి. 645

మ. కొసరు న్బల్కులు తప్పులే యడుగు లుగ్గు ల్గోరుట ల్చాచి
గుసుమాళంబులు మద్దికాయవగ పోగు ల్గాజులు న్బొద్దులున్
రసపు న్దాయెతు గజ్జ లందియలు దోరంబైన పుల్గోరు క్రొం
బసపు న్దాల్గుబుసంబు జెన్నలరు నీ బాల్యంబుఁ జూ చంతటన్. 646

అపూర్వప్రయోగము
గీ. వయసు గనుపట్టుచో నాదు వాంఛ దీరె
ననుచు నెరియెంచి నిన్ను నన్మనుప నింక
భారమని దెల్పి నేను నీ బల్కుబడిని
నమ్మి మనజాతి నడవళ్ళు నాయముగను. 647

చ. తెలిపినవన్నియు న్దెలిసి తేఁకువ వేకువమోము మజ్జనం
బలవునఁ జేసి గన్నుఁగవయందునఁ గాటుకరేకఁ దీర్చ మే
లలికమునందు జాఁదిడి యొయారపు గుబ్బలవాడఁ గుంకుమం
బలఁది కచంబు దిద్ది ఱవిక న్శుకము న్ధరించి వేడుకన్. 648

గీ. వేగ భుజియించి పొగఁ ద్రావి విడెముఁ జేసి
సఖులతోఁ బ్రొద్దు సుద్దుల జరిపి సంజ
వేళఁ బచ్చనగిల్కు పావాలు దొడిగి
బుడత కైదండఁ బూని యి ల్వెడలి బైట. 649

వ. నిలిచిన.