పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

XXVఉమ్మడిగా చెప్పుటయా, రాజరాజ నరేంద్రుఁడు నన్నయ్యతో 'విమలమతింబురాణములు వింటి ననేకములు. ..ఉదాత్తరసాన్వితమైన కావ్యనాటక క్రమములు పెక్కుచూచితి...' నని చెప్పినది తెలుఁగునుగూర్చి యుండదు. ఏలన నాటికి ఆంధ్రమహాభారతమే యింకను పుట్టలేదు. సంస్కృతమును గూర్చి చెప్పినదే. జక్కనదిగూడ గీతమునుండి 'సకలదేశభాషా' ఇత్యాది తెలుగును గుఱించినదిగా గ్రహింపవచ్చును. కాని క్రీ. శ. 1300కు చాల ముందుండియు ఇట్టి వాఙ్మయము ఆంధ్రదేశమందు (భారతదేశమందే) అభివృద్ధియగుచు వచ్చినది. వాఙ్మయమందు కావ్యము ప్రఖ్యాతము ఉత్పాద్యము మిశ్రము అని మూఁడుతెగలుగా విభక్తమైనది. ఇదికూడ తెనుఁగును గుఱించియా సంస్కృతమును గుఱించియా? చిత్రకావ్యములును గుఱించికూడ ప్రస్తావించియున్నాడుగదా, అవేవీ? ఏ వాఙ్మయములో, మఱి 1300 నాటికే ఇవి ఆంధ్రవాఙ్మయమున నుండి యుండినయెడల కవిత్రయమువారిని వదిలినను, శ్రీనాథ పోతనాదులు కూడ దీనిని చేపట్టక తర్వాతికవులే ఎక్కువగా చిత్రకవిత్వమందు విజృంభించినది పరిశోధనీయముగాదా?

జక్కనకు, ఎఱ్ఱనకును ముందువాఁడు మడికిసింగన సకలనీతి సమ్మతమున, తన నీతితారావళినుండి యీ క్రింది పద్యము నుదహరించినాఁడు.

      'పలుకుల తీపును సరసము
       చెలువము నడఁబెడఁగు బంధచిత్రముసొబగున్
       గలకలనఁ జూపవలదే
       కలకంఠియుఁ బోలెఁగవిత కందనమంత్రీ.'

మఱితానేమి ‘బంధచిత్రము' వ్రాసినాఁడు? కానరాదు.

       ఎఱ్ఱననుగూర్చి జక్కన - 'ఈత్రయిఁదాఁ బ్రబంధపరమేశ్వరుఁడై ... ఆచిత్రకవిత్వ వాగ్విభవజృంభితుఁ గొల్చెద'నని వ్రాసినాఁడుగదా, బంధచిత్ర కవిత్వ మీతని రచనలో లేనందున వట్టి రచనాధోరణినిగూర్చినదిగా తోఁచు చున్నది. తన నృసింహ పురాణము ప్రబంధమని చెప్పుకొన్నాఁడుగాని మనుచరిత్ర వంటిదా? కాదు. ‘చిత్రకవిత్వ' మనఁగా అర్థాలంకార శబ్దాలంకారములను పూర్వులకన్న నెక్కువగా వాడినాఁడనియే భావము.

       మనకు మూలాధారమైన సంస్కృతవాఙ్మయమందన్ననో శిశుపాలవధాది కావ్యములయందు కనఁబడుచుండుటచేత మాఘుని కాలమునకే అనఁగా