పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xx

శ్రీవంగూరి సుబ్బారావుగారి యాంధ్రవాజ్మయ చరిత్రను పునర్ముద్రించుచు శ్రీనిడదవోలు వెంకటరావుగారే ఇట్లు వ్రాసిరి. “చిత్రబంధకవిత్వము నన్నె చోడుని నాటినుండియు వెలసినది. భారత కవులు- శ్రీనాథుయుగమునాటి కవులు దీనిని చేపట్టలేదు. క్రీ శ. 16వ శతాబ్దినుండియు విస్తరిల్లినది.” వావిళ్లవారి నన్నె చోడ కుమారసంభవ ద్వితీయముద్రణమున “వాజ్మయమున దొలుత బంధకవితను, గర్భకవితను, చిత్రకవితను ప్రవేశ పెట్టినవాఁడు నన్నె చోడుఁడు” అనియు, “కావ్యాలంకార చూడామణి, కావ్యాలంకార సంగ్రహము, అప్ప కవీయము, మొదలగు నాలంకారిక గ్రంథముల యందీ బంధకవిత్వ ప్రస్తావమున్నది. తరువాతి ప్రబంధకవులు దీని నభివృద్ధిచేసిరి.” అనియు వ్రాసిరి.

ఆంధ్రవాజ్మయమున చాల తర్వాత వెలసినది ఈ చిత్రబంధకవిత్వ పద్దతి. నన్నెచోడుఁడు ప్రాచీనుఁడని భ్రమపడి నన్నయకు ముందుండియు నీ మార్గమున్నదని తలంచి ఎందుచేతనో ప్రాచీనులు చేపట్టలేదని మనవారు తలఁచినారు. నన్నెచోడుఁడు ప్రాచీనుఁడు కాఁడని తిక్కనకు తర్వాతి వాఁడని నేను నిర్ణయించితిని. ప్రాచీనులెవరును చేపట్టని' చిత్రబంధ కవితా రీతులను చేపట్టుట యొకటియే చాలును ఈతఁడు అర్వాచీనుండనుటకు, మిగిలిన యుపపతుల నటుంచి.

క్రీ. శ. 1402లో (శ్రీనాథుఁడు కొండవీటిలో విద్యాధికారియైన సంవత్సరము) వ్రాయబడిన కావ్యాలంకార చూడామణిలో కొంతలక్షణమున్నది. అంతకుముం దే కవియు వ్రాసిన జాడలేదు. జయ దేవ గోకర్ణాదుల ఛందోగ్రంథములు కనఁబడవు. కవి జనాశ్రయము వట్టి సాఫీకవిత్వమునకు మాత్రమే. కావ్యాలంకార చూడామణికారుఁడు 'లవి నన్యోన్యముఖావలోకనము లీలంజేయఁగా లేని యా విలసత్కావ్యకళా చతుష్టములోలిం బర్వనేకస్థ లింబరఁగిం'చినాడు. లక్ష్యములను బట్టి లక్షణము లేర్పఁడుననుట పరిణామ మార్గము, లోక స్వభావము. కాని తెనుఁగునకు మాత్రమట్లుకాదు. కావ్యప్రక్రియలనన్నిటిని మనవారు సంస్కృతమునుండియే గ్రహించినందున ఆంధ్రవాజ్మయ చరిత్ర యంతయు సంస్కృత మర్యాదలను మనము తెచ్చుకొన్న విథపు చరిత్రయే. తెలుగులో మొదట మొదట పద్యరచనకు వలయు ఛందశాస్త్ర గ్రంథములు, తర్వాతవ్యాకరణము- కేతన యొక్ష ఆంధ్రభాషాభూషణము మొదటిది-అటువెనుక అలంకార గ్రంథములు, తర్వాత భావరసాదులు, చిట్టచివర చిత్రబంధాది