పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxi

కవితలు, ఇవన్నియు కొంత కుదురుపాటునకు వచ్చునప్పటికి ఆంధ్రాలంకార గ్రంథములు వచ్చినవి గాని అంతవఱకు సంస్కృతలక్షణ గ్రంథములే యాధారములు. తెలుఁగురచనలు అంకితమిచ్చి ధనము సంపాదించుటకేగాని సందేహములు తీర్చుటకు సంస్కృత గ్రంథములే. ఉదా- ధర్మశాస్త్ర వైద్య శాస్త్రాదులకు తెలుఁగు గ్రంథములు కలవా? ఆంధ్రులైన విద్యానాథామృతానందాదులు సంస్కృతమునందే వ్రాసిరి.

కాఁగా - ఆంధ్రవాజ్మయ ప్రారంభ యుగపు కవులందఱును పౌరాణికులు, కథకులు, వారిది పురాణకథన శైలి. తమంతట దొరలిన యలంకారములేగాని ప్రయత్నపూర్వకముగా కూర్చుట కానరాదు. విన్నకోట పెద్దన లక్షణము వ్రాసినను సమకాలికాంధ్రరచన కానరాదు. తన లక్షణములకు లక్ష్యములను తానే కల్పింపవలసివచ్చినది. ఆతఁడు ఆలంకార ప్రకరణములో అర్థాలంకార శబ్దాలంకారములతోనే చిత్రబంధ కవిత్వమును కలిపినాఁడు.

కం. “శ్రీలింపవలయుమది శ
      బ్దాలంకారంబులైన యమకాది విచి
      త్రాలిఖిత బంధభేదము
      లోలిన యొక కొన్ని వాని నొనరింతుఁదగన్."

అని చిత్రబంధ కవిత్వములను ప్రత్యేకింపక ఒకటిగానే చెప్పినాడు. కవితారీతుల భేదములలో చతుర్విధములనిగాని మృదుమధుర చిత్రవిస్తరములని వ్రాయలేదు. కారణము నాటికి లేనందుననే.

[1]మనతెలుఁగు ప్రబంధములలో మొట్టమొదట ఇట్టి విచిత్ర రచన చేసినవాడుగా ప్రసిద్ధుఁడు జక్కనతాత పెద్దయ. ఈతని రచన లేవియు కానరావు గాని ఈతనిం గూర్చి జక్కనయే తన విక్రమార్క చరిత్రమున నిట్లు వ్రాసినాడు. (సీసమాలిక)

సంస్కృత ప్రాకృత శౌర సేన్యాదుల
             ఘటికలో నొకశతకంబుఁజెప్ప,
బ్రహసన ప్రకరణ భాణాదిబహువిధ
             రూపకంబులయందు రూఢిమెఱయఁ
జక్ర చతర్భద్ర చతురుత్త రాధిక
             క్షుద్రకావ్యములు పెక్కులు రచింప,
నాంధ్ర కవిత్వంబునందుఁ బ్రబంధంబు
            మేలునాదజ్ఞులు మెచ్చఁజెప్ప,

  1. చూ. నా నన్నెచోడుని కవిత్వము,