పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xix

క్రొత్త పోకడలు, కావ్యనిర్మాణాలంకారాదిక రచనలలో నూతన వర్ణనా విధానములు, ఇత్యాదులను తల పెట్టిన వారేలేరు, 'గతానుగతికోలోక' కాఁబట్టి తెలుఁగులో చిత్ర బంధకవిత్వాదుల చరిత్రను చూచుట యుక్తము.

అలంకారముల పెంపకము

6. తెలుఁగులో చిత్రబంధకవిత్వాదులు

వీని చరిత్రమును నేను నా నన్నెచోడుని కవిత్వ విమర్శలోను(1968) శృంగారనైషధ ద్వితీయ ముద్రణావతారిక లోను (1961) చాలవఱకు వాసి యున్నాను. మరల సంగ్రహముగా వ్రాసెదను. నన్నయ వ్రాయలేదు. ఆయనది కథాకథన మార్గము. 'ప్రసన్న కథాకవితార్ధయుక్తి, అక్షరరమ్యత' తాను “నానారుచిరార్థ సూక్తినిధి.' తిక్కనయు ఆంతే. కథాకథన కుశలుఁడు 'రసాభ్యుచిత బంధముగ వ్రాసినవాఁడు. నన్నయ్య చతుర్విధ కవితలను ప్రస్తావించినాఁడని కొందరు పెద్దలు తలంచి, నన్నయ భారతావతారికలో ‘మృదుమధుర చిత్రవిస్తర నవరస భావభాసుర రచనా విశారదులైన మహా కవులు' అను పాఠముదాహరించిరి. (ఆ1-8) అట్లే శ్రీనాథునిలో 'మృదు మధుర చిత్రవిస్తరకవితా విలాస వాగీశ్వరులగు కవీశ్వరులును' అను వాక్యములకు మాతాతగారు నైషధవ్యాఖ్యలో చతుర్విధ కవితలపరముగా అర్థము చెప్పక వానిని విశేషణములుగా గ్రహింపఁగా, ఆక్షేపించిరి. దీనికి నేను సమా ధానము వ్రాసితిని. నన్నయవాక్యములు -'అఖిలజలధి వేలావలయిత ... మృదు మధుర రసభావభాసురవార్థ వచనరచనా విశారదులైన మహాకవులును? ఈపాఠమునే వంగూరి సుబ్బారావుగారు గ్రహించినారు. వారు “మృదుమధుర చిత్ర విస్తర' పాఠమును సూచింపనైనలేదు. ఈకవులెవ్వరని శ్రీసుబ్బారావుగారు తర్కించి తెలుగు కవులే' యని తేల్చినారు. 'అయినచో వారు వ్రాసిన కావ్యము లెవ్వి? కానఁబడవు” అనియు వ్రాసినారు. (చూ. వారి ఆంధ్రవాజ్మయ చరిత్రము.) అప్పకవి (క్రీ. శ. 1656) నాటినుండియు వీనికి ఆశుబంధ గర్బ. చిత్రకవిత్వములను మత మేర్పడినది. నన్నయ శ్రీనాథు లిరువురును ఆశువునకు 'మృదు' వని వాడియున్నారు. మధురమో? ఆశువే మృదుమధురమై తర్వాత బంధకవిత్వమాంధ్రకవితా వధూటికొక బంధమైనదా ? చూతము.

నన్నయ తర్వాత తిక్కన కేతన మారన మంచనలలో ఈ రీతులు కానరావు. శివకవులైన పండితారాధ్య పొల్కురికి సోమనాథాదులలో లేదు.