గీ. పూర్ణచంద్రాననకుఁ దలిర్మోవి మోవి
భద్రగజగామినికిఁ దేనె పలుకు పలుకు
పూవుఁబోడికి మిన్నఖములు నఖములు
గాఁదగె లతాంగి చిత్రసంగతి నెసంగె. 321
గీ. అనుచు వెఱఁగంది పన్నగాహార్యవిభున
కీతలోదరి యూరుపేరెఱుక పడఁగఁ
దెలిసి యెఱింగింతునని మదిఁ దలఁచి యధిక
సంభ్రమంబున జేరంగఁ జని యతండు. 322
ఉ. కాంత విలాసవైఖరులు కన్నులపండువు గాఁగఁ జూచియే
కాంతలచేత నీ యబల కార్యములెల్ల నెఱుంగువాఁడ నీ
చెంతకు నెట్టిమార్గమునఁ జేరెద నింకిట నెద్దిబుద్ధి యీ
యింతిని మావృషాద్రిపతి కెవ్విధిఁ గూర్తు నటంచు నెంచుచున్. 323
క. నావచ్చినపనియైకద
కావలె నఁట మీఁదవలయుఁ గార్య మటంచున్
దేవకరస్థస్యేనము
దా వెదకుచు నింతనంతఁ దరుణీమణులన్. 324
ఆ. డాయనేగి యొక్క తోయజముఖితోడ
నున్న డేగఁ గాంచి యుత్సహించి
మంత్రివర్యుఁ డపుడు మానినీమణితోడఁ
బలికె స్వామికార్యపటిమ దెలియ. 325
క. ఏవిధమున నీడే గిపు
డీవనిలో మీకు దొరికె నిది మాహరిచేఁ
దావలమైనది మీరా
దైవం బెవ్వరని యడుగఁ దలఁచితి రేనిన్. 326
చతుర్వర్ణయమకగీతి
గీ. మావిభుండు యశోస్థ హిమావిభుండు
మావిధుం డాస్యజితపూర్ణిమావిధుండు
మావిలాసి తనూసుషమావిలాసి
మాగురుండు నితాంతక్షమాగురుండు. 327
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/173
స్వరూపం
ఈ పుట అచ్చుదిద్దబడ్డది