పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యథార్థప్రతిపాదకపద తదాద్యక్షర నిర్ముక్తార్థాంతర సూచకపద్య తదాక్షర వినిర్ముక్త వర్ణాంతర గ్రాహి సీసము - అపూర్వము
సీ. భూరిపున్నాగంబు పొక్కిలి నాగంబు
గతి గంబురాపల్కు కళుకు చెక్కు
లవిరణరాంశుకం బవయంబు శుకంబు
కలితవాక్యనిరూఢికంబు వరుత
ఘనవసుధాస్థితి కటిమండలము సుధా
రీతి యధరము ధాకృతికుచములు
నవచకోరములు నయనముల్ కోరక
ములు దంతములు రకము పురివేణి
గీ. అలప్రవాళముకేలు వాలమ్ము చూపు
నభము నెన్నడుము భములు నఖరతంక్తి
ధనువు కనుబొమ నువుబువ్వు తళుకునాస
వెన్నెల నగవు నెలమోము వెలఁది కలరె. 307

రూపకాతిశయోక్త్యనుప్రాణితగమ్యోత్ప్రేక్షాలంకారము
సీ. జగిమోము నెత్తమ్మిజేసి యచ్చటితేనె
తియ్యనిగచ్చువాతెఱను నునిచి
మెఱుఁగుమీఁగాళ్ళు తామేళ్ళను జేసి త
త్కఠినతపాలింఢ్ల గలుగ నునిచి
నునుపు మీఱిన తొడ లనఁటుల జేసి యం
దలి కపురమ్ము పల్కులను యునిచి
పొక్కిలి గవిఁజేసి యక్కడి యిరులచాల్
పొందుగా నవలగ్నమందె యునిచి
గీ. గళము దరమునఁ జేసి యక్కళుకు మొలక
నగవుననె యుంచి మేను మించుగను జేసి
దాని బెళుకులు చూపులలోన యునిచి
జగతి నీకొమ్మ నలువ వింతగ సృజించె. 308