పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. ఎండచేఁ గంది దండనాథుండు దాను
నందనమునకు వెడలి యానందలీల
వచ్చి వనిఁ జొచ్చి చల్లనివసతు లందు
బడలికలఁ దేలి వయ్యార మడర నపుడు. 282

గీ. తళుకు గులుకంగ ననుచు మావులను బెనుచు
కొనిన పూదీవ లునుచు వాసనల గొనుచు
మలయు నీడల నిలుచు జల్వలను మనుచు
మెలఁగు నలులను బెనుచఁ దెన్నులను జనుచు. 283

గీ. మిసిమిరాచిల్కఱెక్కల పస నదల్పఁ
బూను నచ్చపు బచ్చఱాతేనె జూచి
యాత్మ నరుదంద దందశూకాద్రినేత
సచివుఁడును దాను గూర్చున్న సమయమునను. 284

అపూర్వప్రయోగము
సీ. వేగమె మదినెంచి వేంకటనాథుండు
తనదు నెయ్యంపుఁబ్రధాని జూచి
యివ్వని మనడేగ యెచ్చట నున్నదో
నెమకు పొమ్మన రమారమణునాజ్ఞ
జవదాట కవ్వేళ జని యమాత్యవరుండు
చిరతనూరను పద్మసరసిచెంత
నెచ్చెలు ల్గొల్వఁగా హెచ్చిన నాంచారు
దేవిని గనుఁగొని భావమునను
గీ. సంభ్రమంబు ముదంబు నాశ్చర్య మొకటి
పెనఁగొనఁగ నప్పు డౌరౌర యనుచు
దొరలగా నొక్కు ఘనసార తరువునీడ
నిలిచి యచ్చెంత నున్న నెచ్చెలులఁ జూచి. 285

అపూర్వప్రయోగము - యమకము
క. నాళీకవనాళీ కల
నాళీకకువేలపాలహారిముఖాళీ
పాళీదృక్పాళిం గని
బాళిం బడెనేని మౌని బద్ధుఁడు గాఁడే. 286