పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఒకవంకఁ బువ్వుతేనియ
నకలంకంబైన వంక యండను మెలఁగన్
బికశారికశుకనికర
ప్రకటరవంబు విని సతులు పరమోత్సవలై. 275

ఉ. కేవలమైన నుంజిగురు కెంజడమై సుమనఃపరాగ మే
తావి విభూతిై పికలి తాననినాదము సింగినాదమై
క్రేవలఁ *బూపిదీనియంబు గీల్కొన దాల్చిన యోగపట్టియై
మావివిలాస మింపెసఁగ మన్మథమోహనసిద్ధుఁడో యనన్. 276

  • బూవుదీనియలు


క. ఆచూతము చెంగటఁ గని
నాంచారును దొడుక చెలులు నయమార్గాతి
ప్రాచుర్యప్రౌఢోక్తి
శ్రీచాతురి మనము బొదలఁజేయుచు డాయన్. 277

క. లలనామణు లావేళనె
యెలమామిడి కొమ్మ వదలి యిటునటు జన రాఁ
గులుకుచుఁ బలికెడు డేగను
గలకలమని మువ్వ గదలగాఁ గని వేడ్కన్. 278

ఉ. కాంతలతో నభోవిభుశిఖామణి పుత్రిక వేగడేగ న
త్యంతరయంబునం బొదివి యత్తరుశాఖల నెక్కి మిక్కిలిన్
సంతసమంది పట్టుకొని చాలప్రియంబున గారవించి యం
తంతకు నుబ్బి భూషణమయంబగు హస్తముచేత దువ్వుచున్. 279

ఉ. ఎవ్వరిదొక్కొ యివ్వలన నివ్వని కెవ్వలనుండి వచ్చెనో
జవ్వనులార యిప్పులుఁగు చందము నందము డెందమందునన్
నివ్వెరగందఁజేసె నిఁక నేటికి మాటికి మాటలేటికిం
దెవ్వతెయైన యిట్టిచెలు వెన్నను విన్నను గన్నఁ దెల్పరే. 280

క. అని చిరతనూరి నాంచా
ర్వనితామణి చెంతనున్న వామాక్షి కరం
బున కావేసడము నొసం
గిన యత్తఱి నంజనాఖ్యగిరివరుఁ డచటన్. 281