పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

శ్రీ దేవీ భాగవతము


క. దాశసుతామాణిక్యం | దాశావృతకీర్తి సజ్జనామోదక వి
   ద్యాశీల సత్యవతిఁ గను | నాశన్ బర్వతము విడచి వ్యాసుఁడు నడచెన్.725

-: ధృ త రా ష్ట్రా ద్యు త్ప త్తి :-


ఆ.వె. జన్మభూమి సౌఖ్య సంపద యెట్టిదో | పుట్టి పెరిగి కొన్ని ప్రొద్దులున్న
   యట్టి ప్రేమ వ్యాసుఁ డరిగెఁ దా దీవికిఁ | గలదె జన్మభూమి కంటె సుఖము.726

వ. వ్యాసుం డిట్లు జన్మద్వీపంబు ప్రవేశించి యచ్చటి నిషాదులం గాంచి యిట్లనియె. 727

అ.వె. దాశులార నన్ను దయ నెత్తుకొని ముద్దు | లాడి బువ్వఁ బెట్టి యాడనేర్పి
    బూదివెట్టి నిదురఁ బుచ్చి మచ్చికఁ గన్న | యమ్మ యేది చూపుడనిన వారు.728

తే.గీ. కన్య నీ తల్లి నొక భూమికాంతునకును | ముదమునం బెండ్లిచేసిరి సదమలాత్మ
    యని చనిరి దాశరాజు దా వ్యాసురాక | విని ఎదుర్కొని యర్చించి వినయఫణితి.729

క. నాజన్మ సఫలమాయెను | నాజీవిత మిపుడు పావనం బాయెఁ గులం
    బోజఁ బవిత్రం బాయెను | ధీజితబ్బందారకార్య దీపితవర్యా.730

తే.గీ. దేవతల కబ్బునే నీదు దివ్యదర్శ | నంబు మునినాథ నీ రాక నాకు మేలు
    నీవు గోరినయది యెద్ది నెమ్మిఁ దెలుపు | నాది కాదీ సమస్తంబు నీది సుమ్ము.731

వ. అనిన విని సంతసించి సాత్యవతేయుం డచ్చటనుండి సరస్వతీతీరంబున నాశ్రమం
   బేర్పఱచుకొని తపంబు సేయుచుండె.732

ఉ. శాంతనునందు సాధ్వియగు సత్యవతీసతి కుద్భవిల్లి ర
    త్యంతకలాసమేతులగు నట్టి సుతుల్ పటుధైర్యశాలులై
    సంతత ధర్మకర్ములయి శాంతియు గల్గి నిర్మల
    స్వాంతత వ్యాసమౌని కనుజన్ములునాఁ దగు నిర్వు రుర్వరన్.733

తే.గీ. చెలఁగి చిత్రాంగదుండు విచిత్రవీర్యు | డనుచు లోక ప్రసిద్ధులై రదియుఁ గాక
    గంగయం దొక్కపుత్రునిఁ గాంచె నృపుఁడు | భీష్ముఁ డాతఁడు శత్రువిభేదిగాడె.734

ఉ. అంతటఁ గొంతకాలమున కా మనుజేశ్వరుఁడైన శంతనుం
    డంతము నొందె భీష్ముఁడు మహామతిఁ బ్రేతవిధుల్వొనర్చె న
    త్యంత ముదంబునన్ మహిసురావళికిం బహుదానముల్ దయా
    వంతుఁ డటంచు వారలు స్తవంబులు సేయ నొనర్చె భక్తితోన్.735

క. చిత్రాంగదభూపతి రా | జ్యత్రాణమునందు నిలిపి యతఁడును బూజా
    పాత్రుఁడయి యూరకుండెన్ | చిత్రము దేవవ్రత ప్రసిద్ధి వహించెన్.736