Jump to content

పుట:శ్రీసూర్య శతకము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేజముచే కాంతిమంతమగుచున్నదో, ఏది జగమునకు ప్రాణమైయున్నదో, ఏది జగత్సృష్టికి హేతువును రక్షణయు, పోషణయు నగుచున్నదో అట్టి రవి మండలము మీకు మోక్షము నొసంగుగాక.[77]

చ. గలగల యెండునేలల యగుం జలధుల్ కులపర్వతంబులున్
దిలతులనంబులై నలుగు దిట్టపుఁ గాఁక యుగావసానవే
శల నని లోకరక్షణపరాయణత న్నిఖిల ప్రభావళుల్
మెలపక వెల్గుమాత్ర మిడు మిత్రునిబింబము మీ ముదంబిడున్.

తా. ప్రళయకాలమున సముద్రము లింకపోవును. కులపర్వతములు పెట్లి పోయి తిలప్రమాణము లగును. అట్లు కాకుండ ప్రతిదినమును జగమును రక్షించు రవిమండలము మీకు శ్రేయము లిచ్చుగాక.[78]

చ. చెరువు వియత్తలం బడుసు చీఁకటి తృప్తికి వచ్చునట్టి బం
భరములపాళి రాహువునుఁ బత్రము పత్ర మితారుణాభలా
యరుణునిశోభ లిట్టి దగునట్టి సహస్రదళంబుగాదే భా
స్కరు ఘనమండలం బిది సుసంగతి మీకును మంగళం బిడున్.

తా. ఆకాశ మను బావిలో చీకటి యను బురద చీల్చుకొని ఱేకులచే వికాసము చెంది, మూగిన తుమ్మెదలు రాహువువలె నొప్పగా నుండు రవి మండలము మీకు కల్యాణముల నిచ్చుగాత.[79]

చ. పురహరునేత్ర మయ్యు నెఱపు న్నిరవద్యతఁ గామపూర్తి సం
సరణ సముద్రనావ యయి జౌకదు గాలికి నెల్ల వేళలం
దిరిగియు నభ్రమంబు జగతిం భ్రమనాశి విరుద్ధకార్యమై
సరసము సూర్యమండలము శాశ్వతసౌఖ్యము మీకు నిచ్చుతన్.

తా. శివుని మూడవనేత్రమయ్యు మన్మథుని దహింపదు సరిగదా కామము నభివృద్ధి చేయును. సంసార సముద్రము దాటించు ఓడయయ్యు గాలికి చెదరిపోదు. తిరుగుచున్నట్లు కనబడుచున్నను, స్థిరముగా నుండును.