పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శా.

వైకుంఠం బెడఁబాసి శేషగిరిపై వర్తించునారాయణుం
డాకాలంబున నాగుహాంతరమునం దావానరశ్రేణికిం
జోకం జూప నిజస్వరూపము కపు ల్చోద్యంబుగాఁ జూచి భూ
లోకంబందు వచింపఁగా నెఱిఁగి రీలోకంబులో మర్త్యులున్.

246


వ.

ఇవ్విధంబున నాగుహాంతరమున నుండి శ్రీహరి వానరసమూ
హంబునకు వైకుంఠంబు చూపినందున నాగుహకు వైకుంఠ
గుహ యనంబరంగె. నందు నిత్యముక్తులు సేవింప శ్రీభూ
నీళా సమేతుఁడై యుండునాగుహాంతరమును జూచిన వారికి
ముక్తి శ్రీప్రదం బగు ననిన విని శౌనకాదులు ప్రమోద
స్వాంతులై సూతపౌరాణికుం జూచి యిట్లనిరి.

247


ఆశ్వాసాంతము

క.

పంకజలోచన దనుజభ
యంకర సుగుణాభిరామ యవ్యయధామా
శంకరమిత్ర శుభాకర
వేంకటగిరినిలయ మౌనివినుతాంఘ్రియుగా.

248


మాలిని.

కలశజలధిబాలాకాంతశృంగారలీలా
సలలితగుణజాలా సామగానాభిలోలా
కలుషనిచయశైలోగ్రాశనీ వేదమూలా
విలసితగుణశీలా వేంకటాఖ్యాద్రిపాలా.

249


గద్యము.

ఇది శ్రీతఱికుండ శ్రీలక్ష్మీనృసింహకరుణాకటాక్షకలిత
కవితావిలాస వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్యతనూభవ
వేంకమాంబాప్రణీతం బగు వేంకటాచలమాహాత్మ్యంబును