పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

409


వరము లందఱ కిచ్చుచు వారిధనము
లాదరించుచు శ్రీపన్నగాద్రియందు.

354


ఉ.

వేంకటనాయకుం డనఁగ విశ్వమునందుఁ బ్రసిద్ధి నొందుచున్
గొంకక భక్తి విత్తమును గూరిమితోఁ గొని కోర్కు లిచ్చుచున్
సంకరజాతి మర్త్యులకుఁ జానుగ విత్తము నొప్పగించుచున్
బింకము చూపుచు న్ధర కుబేరుని వడ్డికి రూక లిచ్చుచున్.

355


క.

లీలామానుషచర్యలు
జాలం జూపుచు సమస్తజనులకు హితుఁ డై
మేలు నొసంగుచు నీకలి
కాలము ఫణిశైలమునను గనుపడుచుందున్.

356


ఆ.

కలియుగాంతమునను గ్రమ్మఱ వైకుంఠ
మందుఁ జేరి కలియుగాదికాల
మవల వచ్చినప్పు డావేంకటాద్రిపై
మఱలఁ జేరుచుండు మాధవుండు.

357


క.

అని సూతుఁడు వేంకటపతి
ఘనచరితము లొప్పఁ జెప్పఁగా మును లెల్లన్
విని సంతోషము నొందుచు
నని రిట్లని సూతుఁ జూచి యద్భుతపడుచున్.

358


మ.

అహహా సూతపరాత్పరుండు జలజాతాక్షుఁడు నిత్యుండు శ్రీ
యహిరాట్పర్వతనాథుఁ డవ్యయుఁడు సర్వాత్ముండు లీలార్థ మై
మహి మర్త్యాకృతి నొంది పిమ్మట మహామాహాత్మ్యపాషాణవి
గ్రహుఁ డై లోకుల బ్రోచు సత్కథల మాకర్ణప్రమోదంబుగన్.

359