పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

క్రమ్మఱఁ జిలుకుచుండఁ దొల్లింటివలె ఱాయితగులుటం జేసి వెఱగంది భర్తకడకుంబోయి మజ్జిగకుండలో నివ్వడుపున నున్నదని చెప్ప నతండు వచ్చి చూచునప్పటికి నాకుండ నుండుఱాయి నృసింహాకారంబుతో నుండినదనియు, నారూపము చూచి విస్మయభయపరీతచేతస్కుఁడై భార్యం జూచి, తరుణీ! నీవిపు డీవిషయ మెల్లవారికిం జెప్పి దోడ్కొని రావలయు ననఁగ, నామె పోయి యెల్లవారికిం జెప్పి పిలుచుకొని వచ్చినదనియు, నావల నందఱాస్వామిని యనేకవిధంబులం బ్రార్థించిరనియు, అత్తఱి నశరీరవాక్కుల నాస్వామి, భక్తాగ్రేసరులారా! మీదురంతకష్టంబులం బాపి మీయిష్టంబు లిచ్చుటకు నీతఱికుండ నుదయించితిననియు, నిఁక మీరెందేని పోఁజనదనియు, మీరు నాకియ్యెడ నాలయంబు నిర్మించి నన్నారాధించుచుండుఁడనియు, మీరు నన్నీదినమునుండి “తఱికుండ నృసింహుఁడు" అని నామంబిడి భజించుచుండుఁడనియుఁ జెప్పుటంజేసి, వారట్లు చేసిరనియు, నక్కారణంబున నీయూరికి నిపుడు తఱికుండ యని చెప్పుచున్నారనియు, (తఱికుండ=మజ్జిగచిలుకుకుండ) తఱికుండయని చెప్పవలయుంగాని, తరిగొండ యని చెప్పనొప్పదనియు, మాపెద్ద లాకాలంబున రాయదుర్గగ్రామంబుననుండి వచ్చి యిచ్చట నిల్చియుండుటం జేసి మమ్మిపుడు రాయదుర్గమువారని పిలుచుచున్నారనియుఁ జెప్పె.

కాఁబట్టి యీతఱికుండ యనుగ్రామము కడపమండలము రాయిల్పాడునకు నాల్గుమైళ్లదూరంబున నున్నది. ఈ గ్రథకర్త్రియగు వేంకమాం బాగ్రామంబుననుండిన దగుటంజేసి తఱికుండ వేంకమాంబ యని చెప్పుచున్నారు. ఈమె రచించినగ్రంధములలో, రాజయోగసారమును ద్విపదకావ్యమును, వేంకటాచలమాహాత్మ్యంబను నొకపద్యకావ్యంబును, ముక్తికాంతావిలాసంబను నొకయక్షగానగ్రంథమును ముద్రింపఁబడియున్నవి. ఈమె తాను భాగవతము ద్వాదశస్కంధంబులను ద్విపదకావ్యముగ రచించినట్లు వేంకటాచలమాహాత్మ్యమునఁ జెప్పుకొనియున్నదిగాని ఆపుస్తక మెచ్చటం గానరాదు. వేంకటాచలమాహాత్మ్యములోఁ బ్రథమాశ్వాసములో నేడవపద్యమునందు:-