పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

తఱికుండ యనుగ్రామంబునకుఁ గొందఱు తఱికుండ యనియు, మఱి కొందఱు తఱిగొండ యనియుఁ జెప్పుచున్నారు. ఈవిషయముగూర్చి నే నాగ్రామంబునకుఁ బోయియుండినప్పుడు, “వైద్యజ్యోతిషాంధ్రసంగీతవిద్యావిశారదు”లగు రాయదుర్గము నరహరిశాస్త్రులవారి నడుగుటంజేసి ఆయన నాకిట్లు వచించె.

పూర్వము రాయదుర్గమనుగ్రామనివాసులు క్షామచోరబాధలకు నాగ్రామంబున నుండనోపక నిజగృహంబులు వదలి పశువులం దోలుకొని తమకుటుంబములతో నెందేని జలసస్యసమృద్ధిగలప్రదేశంబున కేగుదమని వచ్చుచు మార్గమధ్యంబున నొక్కయెడ నందఱు మార్గాయాసంబునకుఁ గొన్నాళ్లుండి వోఁదలంచయుండిరనియు, వారునిల్చియుండినప్రదేశంబునకుఁ, “బ్రత్తిమిట్ట” అని పేరుండినదనియు, నొకదిన మందఱుం దమకష్టంబులకుఁ దమగ్రామమునం గల శ్రీనృసింహస్వామిని, “హా! ప్రహ్లాదరక్షకా! దీనబంధూ! మమ్మీ దుర్భిక్షకాలంబున డగ్గఱనుండి రక్షింపుమా!” అని యనేకవిధంబుల భజనచేయుచుండిరనియు, మఱునాఁ డుదయంబున నొకబ్రాహ్మణస్త్రీ తనవాడుకచొప్పున మజ్జిగ దఱుచుచునుండ నామజ్జిగకుండలో నొకరాయి యుండి కవ్వమునకుఁ బలుమాఱుఁ దాఁకుచుండ నది యేమని తలంచి యావిప్రాంగనయగు లక్ష్మీనరసమ్మ తనకరంబున నాకుండను దడవి చూడ నేమియు దొరకకుండెననియు, మఱల నానారీమణి తఱుచుచుండఁగా ముందువలె నొకఱాయి తగులుచుండెననియు, మఱలఁ బరిశోధింప నాకుండలో నొకఱాయిగాని లేకుండెననియు, నివ్విధము రెండు మూఁడుమాఱులు చూచి విస్మయపరీతచిత్తయై కొంతవడి యూరకుండి