పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

క. "అలకాశి నుండి వెలువడి
   వలనుగ మాకొఱకు నందవరపురమందే
   నెలకొని కులదైవతమై
   యలరుచు మమ్మేలు చౌడమాంబను కొలుతున్."

అని వ్రాసియుండుపద్యంబును బట్టి చూడఁగ నీమె నందవరీకబ్రాహ్మణస్త్రీ యని తెలియఁబడుచున్నది. ఈమె తనభర్తయొక్క నామగోత్రసూత్రంబులు చెప్పక “వసిష్ఠగోత్రపవిత్ర కృష్ణయామాత్యతనూభవ” అని తాను గృష్ణయామాత్యునికూఁతురైనట్టు చెప్పుకొనుటచేత నీమె బాలవితంతువయి తనకాలమంతయు దత్వగ్రంథపఠనాదులయందుఁ గడపినట్లున్నది. 1840 సంవత్సరమినందు జీవించియుండినట్లు తఱికుండగ్రామంబునఁ గొందఱు వృద్ధులు చెప్పుచున్నారు. ఈ వేంకమాంబగారు మదనపల్లెలోనుండిన, బ్రహ్మశ్రీ, రూపావతారం సుబ్రహ్మణ్యశాస్త్రులువారి నాశ్రయించి తత్వముపదేశింపఁబడి నాలుగైదువత్సరంబులు తఱికుండ శ్రీనృసింహస్వామిదేవాలయంబునంగల ఆంజనేయస్వామివిగ్రహంబునకు వెనుకప్రక్కగనుండు నొకరహస్యస్థలంబున యోగంబున నుండినట్లును, అర్చకుఁ డొకదినంబునఁ గని, అదివఱ కాయూర నీవేంకమాంబపై నేదియో యొకదోషము కల్పించియుండుటకును, నాలుగైదేండ్లు వేంకమాంబ కన్పట్టకుండుటకును కల్పించినదోషము సత్యంబని తలంచి యాఆయర్చకుఁ డామెను బిలిచి, “ఓసి రండా! దుష్కర్మంబులు చేయుటగాక యీదేవాలయంబునకు వచ్చి యీలాగు వేషము పూని స్వామివారి వస్త్రభూషణంబుల నపహరింప సమకట్టితివా” యని దూషించి ఆమె చేయుయోగంబును భంగపఱచి యీవల కీడ్చి కొట్టి పంపుటం జేసి ఆమె యందుండక శ్రీతిరుపతి వేంకటాచలంబునకు వచ్చి తుంబురుకోనయం దొక్కెడ నైదాఱువత్సరంబులు తపంబొనర్చి పిదప శ్రీస్వామిపుష్కరిణికి నుత్తరభాగంబున నొక చిన్న మంటపంబునఁ జేరియుండినదనియు, అట్టికాలంబున ముందెఱింగించినగ్రంథంబులు వ్రాసినదనియుఁ దెలియబడుచున్నది. మఱి యామె స్త్రీలకు ననేకములగు