పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

137


తే.

పొసఁగ మనుజులచే బాహ్యపూజలందు
గుప్తముగ దేవపూజఁ గైకొనుచునుండు
పరులు తను జేరి కోరిన వరము లిచ్చి
మహిమఁ దనరారఁ జూపును మాధవుండు.

57


ఆ.

అల్పదానమైన నధికంబుగను జూచి
స్వల్పపూజకైన సంతసించి
పుణ్యమోక్షములను బొందించు దాసుల
నెన్న వశమె వేంకటేశుమహిమ.

58


క.

ఘనవేంకటగిరిమహిమన్
మనసారఁ దలంచునట్టి మానవులకు నె
మ్మనమునఁ గనిపించుచు దా
నెనసినదయతోడ వరము లిచ్చుచునుండున్.

59


సీ.

అప్రాకృతుండు దానై ప్రాకృతునిరీతి
        దేశప్రజలవెంటఁ దిరిగి తిరిగి
తనమీఁదమోహంబు జనియింపగాఁజేసి
        ప్రేమఁ జూపుచు వారిఁ బిలిచి పిలిచి
నయభయంబులతోడ నాకొండ కిపుడు మీ
        సొమ్ములు ముడుపులు దెమ్మటంచుఁ
బలుకుచు వారివెంబడి నంటి ముల్లెలు
        దెప్పించుకొంచును ధీరుఁ డగుచు


తే.

వారపుడు వచ్చి సకలోత్సవములు వేంక
టాద్రిమీఁదను జేయింతు రాఢ్యులగుచు
నపుడు వారిని మెచ్చి భాగ్యంబు లిచ్చి
మఱలఁ బంచుచునుండు సమ్ముదము నెపుడు.

60