పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

అట్టియుత్సవకాలంబులందు సకల
నిర్జరులు వచ్చి పుష్కరిణీజలమున
స్నానమును జేసి వేంకటేశ్వరుని నఖిల
పుష్పములఁ బూజసేతు రద్భుతము మీఱ.

61


ఆ.

సొరిది భక్ష్యభోజ్యచోష్యలేహ్యజలంబు
లర్పణంబు సేయ ననుము దాన
నారగించు నెనరి కైనను గనుపింప
నియ్యఁ డాక్రమంబు నీశ్వరుండు.

62


తే.

మానితం బగుమాయావిమానమందుఁ
దాను నిజరూపమున నుండి ధరను గృతక
కాంచనానందనిలయమం దంచితముగ
ఘనశిలావిగ్రహమురీతిఁ గానుపించు.

63


సీ.

స్వల్పదానమునకు సంతుష్టుఁడై వారి
        కాయురారోగ్యభాగ్యాదివివిధ
వరముల నిచ్చుచు వారల రక్షించు
        నతినీచజాతివారైనఁ గాని
భక్తిలో శరణని పర్వతంబును జూచి
        నిలిచి మ్రొక్కినను మన్నించి బ్రోచు
కర్మాధికారులు గాని యోషిజ్జన
        శూద్రులకును భక్తి సుస్థిరముగ


తే.

వేంకటేశునిచరణారవిందయుగళ
మందు విస్తారముగఁ బట్టు నందువలన
మూఢభక్తులు గలియుగమున విశేష
కరుణ నేలుచునుండు వేంకటవిభుండు.

64