పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

135


గనుక మే మెంత విన్నను దృప్తి లేదు శ్రీ
        వేంకటేశ్వరుఁ డిట్లు వెలసి శేష
గిరిమీఁదనుండి యేక్రియలందు నడిపించె
        నెవ్వ రెవ్వరికి నేమేమి యొసఁగెఁ
దెలియఁగ కృతయుగత్రేతాయుగద్వాప
        రములయం దంతట క్రమముగాను


తే.

జెలఁగి వర్తించుచుండును గలియుగముల
నేవిధంబులనుండు నాయీశ్వరుండు
సల్పుచుండినచరితము ల్సమ్మతముగఁ
దెలుపవే సూతసత్సూత ధీసమేత.

51


తరళవృత్తము.

అని ముదంబున శౌనకాదిమహామునీశ్వరు లందఱున్
వనజనేత్రుచరిత్రము ల్విను వాంఛతోడను బ్రశ్నచే
సిన ముదంబున సూతుఁ డిట్లనె శ్రీరమేశుఁ దలంచుచున్
వినుఁడు సంయములార చెప్పెద వేంకటేశువినోదముల్.

52


పంచచామరము.

పరాపరస్వరూపుడైన పద్మనేత్రుఁ డాఢ్యుఁడై
యరాతివీరుల న్వధించి యద్భుతక్రమంబుగన్
సురేంద్రమౌనిముఖ్యులెల్లఁ జోద్యమంది చూడఁగన్
ధరామరాదిభక్తులన్ ముదంబుమీఱఁ గాచుచున్.

53


ఉ.

భూతలమందు నిల్చి పరిపూర్ణుడు తానగుచుండియున్ జన
వ్రాతము చూడ శేషగిరివాసుఁ డనంగ జగంబులందు వి
ఖ్యాతిని బొంది భక్తజను లందఱు గొల్వఁగ వారి కెల్ల సం
ప్రీతి వరంబు లిచ్చి కడుపేర్మిగ నుండె రమాసమేతుఁడై.

54