పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యముఅటు లిటు లేమరించి శకులాద్యవతార విహారహారియై
యెటు జనునో విభుండనుచు నెప్పుడుఁ దద్ధృదయస్థలంబునన్
స్ఫుటగతి నిల్చి లోకములఁ బ్రోచెడి లక్ష్మి మదీయసద్మమం
దెటులు చలింప కుండుచు మదిష్టఫలంబుల నిచ్చు నెంతయున్.5

వదన చతుష్టయంబునను వాణి చతుర్నిగమ స్వరూపయై
కదిసి వసింపఁగా సురనికాయము పాయక చుట్టుఁ గొల్వఁ ద
ద్విదులు సనందనాదులు నుతింపగఁ గొల్వొనరింపుచుండు నా
త్రిదశవరేణ్యుఁడైన విధి దీర్ఘతరాయువు మాకొసంగెడిన్. 6

వాణి పయోజపాణి మృదు వాగ్రచనా స్తుతి గీత సర్వ గీ
ర్వాణి సమస్త శాస్త్రవిసరాగమ వేద నుతోరు సద్గుణ
శ్రేణి విరించిరాణి యతసీ సుమ నీల మిళిందబృందరు
గ్వేణి మదీయ జిహ్వపయి వేడుకతో నటియించుఁగావుతన్.7

నిజజన కాగ్రభాగమున నిల్చినవేళఁ దదీయ మూర్ధ వా
రిజ రిపుఖండముం గని పరిస్ఫుట మౌళి నదీజ పాండురాం
బుజమని యెంచి చూచి దృఢపుష్కరముంచి పెకల్చఁబూను న
గ్గజముఖుఁ డస్మదీయ మగు కార్యతతిన్ ఘటియించుగావుతన్ . 8

వ్యాస మయూర బాణులను భారవి మల్హణ దండి కాళికా
దాసులఁ గొల్చి యాంధ్రకవితాఢ్యులు నన్నయఁ దిక్కయజ్వ ను
ద్భాసితుఁ బోతరాజు ఘను భాస్కరు సోమునిఁ బ్రస్తుతించి యు
ల్లాసముమీఱ నీ కృతి విలక్షణతన్ రచియింపఁ బూనితిన్. 9

వృత్త నియమంబు నీతిని నెడలఁబుచ్చి
తమ ప్రబంధ రతికి మెచ్చి ధనము మూర్ఖు
లొసఁగ సుఖియించి వేశ్యల యొప్పు దెప్పు
కుకవి సత్కావ్యములఁ జూడఁ గోరు టెట్లు ?10