పుట:శృంగారశాకుంతలము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

శృంగారశాకుంతలము

     మ్మునివరు లేమి పరాభవ
     మొనరించిరొ నాకుఁ జెప్పు మున్నవిధంబున్.169
చ. మనమున జంకు గల్గినను మాన్చెద నే నది మంత్రశక్తిచే
     మునుల[1]యవజ్ఞ గల్గినను ముందఱికి న్మనసీమలోనికా
     ననములు గుత్త యిచ్చి జతనంబుఁ జేసినఁ గందమూలము
     ల్దినియెడువారు గాగ నరు దెంచి వశంవదు లౌదు రందఱున్.170
వ. దీని కింత చింత యేల జగతి యేలంగలిగిన నావంటి సేవకుండు సిద్ధించి
     యుండ నశక్తుండునుంబోలె నుండు టేటిప్రాభవం బనిన సాధుజనపోష
     కుండు విదూషకున కి ట్లనియె.171
గీ. ప్రాణసఖుఁడవు నీకుఁ జెప్పక మదీయ
     వృత్తగోపన మెట్లు గావింపనేర్తు
     మచ్చనాలుకవాఁడవు మంతనంబుఁ
     బొడమనీకని రసనకు బుద్ధి చెప్పు.172
మ. మదనారాతిసమాను గాశ్యపమహామౌనీంద్రు సేవింప స
     మ్మదమారం జని యాశ్రమంబువనసీమం గంటి వాల్గంటిఁ, దో
     యదనీలాలకఁ, గంబుకంఠిఁ, గరిణీయానం, బయోజానన
     న్సదసత్సంశయగోచరోదరి, సుధాసంబాధబింబాధరిన్.173
సీ. నిండుఁజందురునకు నెత్తమ్మివలపును
                    నద్దంపుఁబొలుపును నబ్బెనేని
     కరికుంభములకు బంగారుతార్పులయెప్పు
                    శకటాంగములవిప్పు జరిగెనేని
     యరఁటికంబములకు గరభంబు నునుడాలుఁ
                    దూణీరములమేలు దొరకెనేని
     సరసిజాతములకు [2]జంత్రంబుఁబెంవును
                    జిగురాకుసొంపును జేరెనేని

  1. యనుజ్ఞ
  2. జంత్రంపు