పుట:శృంగారనైషధము (1951).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

305


చ.

హటదురులీల నిర్జరులు నచ్చరలేమలు వేల్పు టేట నొ
క్కట విహరింప సందడికిఁ గాక తొలంగి చరించుమీనక
ర్కటమకరంబు లొక్కొ! యనఁగా గగనాగ్రమునందు మీనక
ర్కటమకరంబు లెంతయుఁ బ్రకాశము నొందె నిశాప్రసంగతిన్.

162


మ.

విపులాకాశనిపాతభీతికలనావిన్యస్తదుర్వర్ణకీ
లపరిస్ఫూర్తినిశాలతాకుసుమముల్ భాసిల్లె బ్రహ్మాండమం
టపకాష్ఠామలకీటరంధ్రరజముల్ నాకాపగాచక్రవా
కపురంధ్రీనయనాశ్రుబిందువులు నక్షత్రగ్రహగ్రామముల్.

163


అంధకారవర్ణనము

ఉ.

కాలకిరాతపాదతలఘట్టనఁ జేసి వియద్వనీమహా
కాలఫలంబు భాస్కరుఁడు గ్రక్కున నస్తమహామహీధర
స్థూలశిలాస్థలిం బడియెఁ దోరము లైనతదీయబీజముల్
నీలరుచుల్ వడిం జెదరె నింగి ననచ్ఛతమశ్ఛలంబునన్.

164


తే.

పగలు బ్రహ్మాండభాండకర్పరమునందు
గగనమణిదీపమున నైనకజ్జలంబు
రాలెనో కాక యంధకారంబుపేరఁ
గాలవాతూలహతి నిశావేళయందు.

165


వ.

అంత నమ్మహీకాంతుం డట మున్న నిశాముఖోచితక్రియాకలాపంబులు నిర్వర్తించుటం జేసి క్రీడాసౌధంబు నేడవనిలువునకు దమయంతీసమేతంబుగా నరిగి యచ్చోట శుద్ధాంతకాంతాజనంబు పరివేష్టింపం గొలువుండె, నప్పుడు పొడుపు గుబ్బలిమీఁదం బొడతెంచుపూర్ణచంద్రబింబంబుం బొడగని యంగన కిట్లనియె.

166