పుట:శృంగారనైషధము (1951).pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

శృంగారనైషధము

చంద్రవర్ణనము

తే.

శుద్ధకాంచనపిండంబు సూర్యఁ దిగిచి
పూర్ణశశిపూఁతబంగారుపుటము నొసఁగి
సాయ మనుధూర్తు వంచించె జగమునెల్ల
దెల్లఁబాఱెడునదె చూడు తెఱవ! విధుఁడు.

167


సీ.

ఇందుకాంతంబుల నెబ్భంగి వడిసెనో
        నిష్యందకీలాలనిర్ఝరములు?
చక్రవాకముల లోచనయుగ్మకముల నె
        ట్లుబ్బెనో విరహబాష్పోదకములు?
చంద్రాతపమున నే చందాన గురిసెనో
        ధారాళ మగుచు నీహారవృష్టి?
విపినవీధికల నే విధమునఁ గాఱెనో
        శేఫాలికాపుష్పసీధుధార?


తే.

యన్ని ముఖముల నభివృద్ధి యెసఁగ దేని
యొదిఁగి పవలింటియట్లన యుండుఁగాక
యూర కేల విజృంభించు నుదధు లేడు
నుత్పలేక్షణ! యీశశాంకోదయమున.

168


క.

లీలావతి! యామవతీ
కాళిందీసైకతంబు గగనోదన్వ
ద్వేలాడిండీరము చం
ద్రాలోకం బింత యొప్పునా యివ్వేళన్!

169


ఉ.

దేవి! తమోమషీరసము తేటఁ బొసంగఁగ గట్టివెట్టి యం
కావళి వ్రాయఁగాఁ దొడఁగె నంబరసంపుటకాంతరంబునం