పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

444 శుకసప్తతి

దెలిపి పతివ్రతాశిరోమణియగు నీ కిట్టిగుణంబులు పుట్టునే యని బహూకరించెం గావున నయ్యమాత్యకుమారికకుం గలయగణ్యనైపుణంబు గలిగినంగాని ధరణిభుజంగుని సంగతికిం జనగూడునే యనునంతలో నరుణోదయంబైన ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరిగి క్రమంబున దినావసానం బగుటయు. 260

చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్
గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్
తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్
కలవలరాజుఁబోలు నరనాథుని జేరగ నేఁగు నత్తరిన్. 261

క. చని నాఁటిరేయి నరపతి
నెనయన్ దద్గేహసీమ నేఁగెడుదానిన్
కనుగొని యనియెన్ గీరం
బును దనపల్కులను నమృతముఁ గులుకంగన్. 262

ముప్పదితొమ్మిదవకథ

క. కలహవిజృంభణబాహా
బలనిర్జితశత్రురాజబలుఁ డతిలోకో
జ్జ్వలచిత్రసేనుఁ డప్పురి
చెలువొందగ నేలు చిత్రసేనుం డనఁగన్. 263

గీ. అతఁడు నాతనిదేవేరి నతులదివ్య
లక్షణాకృతి సయ్యాదిలక్ష్మిఁ బోలి
వెలయు సుబలాంగనయు సముద్వేలలీల
నేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264