పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నున్నట్లు తోఁపదు. వ్రతకథలకును గొంద ఱేశివుఁడో యేవిష్ణువో లోకానుగ్రహకాంక్షతో నీవ్రతాచరణమునఁ బుణ్యము గలుగునని దారము లేక మఱ్ఱియూడతోరము గట్టుకొన్నను, బియ్యపుపిండి లేక నివ్వరిగింజలు రెండునూఱి నైవేద్యము చేసినను జాలును, స్వర్గము చేతిలోనికి వచ్చునన్న చిట్టిచిట్టి వ్రతములు సెలవిచ్చినట్లు కలదు. అందేదో పుణ్యమో పురుషార్థమో యున్న దనుచున్నారు గావున వానికి నమస్కారము. ఇట్టి నీరసకథలుకూడ నట్టిమహర్షులు సట్టియుత్కృష్ట దైవతములు చెప్పినట్లు కల్పించుట యుచితముగానుండదేమో యని కొందఱకైనఁ దోపకమానదు.

హంసవింశతికర్త తన గ్రంథములోఁ బర్యాయపదముల నిఘంటువును గుది గ్రుచ్చి కథ కడ్డువచ్చునట్లు చేసి పాఠకులను బాధ పెట్టినాఁడని కొందఱనుచున్నారు. కథ కానిఘంటువు కొంతవఱ కడ్డుతగులుచున్న మాట సత్యమే. ఈకవి యట్లు చేయక, అంతకంటే నెక్కుడుమాటలను సందర్బోచితముగ నందందుఁ జేర్చి కథ కడ్డు రాకుండఁ జేసి పాఠకుల మెప్పునకుఁ బాత్రుండయ్యె ననవచ్చును. ముప్పదికథలలోనే యిన్ని చమత్కృతు లున్నవియే, డెబ్బదిలో నెన్ని యున్నవో! అవి మనకు లభింప లేదయ్యెఁగదా యని విచారపడవలసివచ్చినది. ఈ చక్కని వాగ్జాలము రాజిల్లు నీతనిముఖమున నేరామాయణమో, భాగవతమో మనము వినుభాగ్యముపట్టిన నెంతమనోహరముగ నుండునో గదా!