పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 345

వచ్చివచ్చి యతండు దుర్వారపుణ్య
వత్కృతప్రపమైన యవ్వటముఁ జేరె. 449

వ. చేరి తద్విశాలపానీయశాలాంతరంబునం బరికీర్ణోశీరతాశీతలం బగుభూతలంబున విశ్వనాథేతివచనముఖరుం డగుచు విపథం డించినవిధంబునం గంబడి పఱచి సుఖాసీనుండై యచ్చెంగటం గూడిన యధ్వనీనులవలన యాచితోపలబ్ధం బగుతాంబూలంబునం బరితుష్టుండై యందు నందంబగు పందిటం దోరణంబుగా హత్తించిన పసుపుటాకులగుత్తుల కత్తమిల్లు నెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై దిశాభిత్తికల నొత్తుకొనుటకుం బ్రమోదాయత్తచిత్తుం డగుచు దట్టంబుగా నుట్టులం బెట్టినసారంబు లగుఘృతక్షీరపూరంబుల నుగ్గులిడి యగ్గలపునిగ్గులు గలపాలబుగ్గలు ముద్దాడి నిద్దంబులై వ్రేలు వైణవడోలికల బాలకుల నునిచి జోలలు వాడుచు నిజమందిరాంగణంబునం బోలె మెలంగు పథికాంగనలఁ గనుంగొని యాశ్చర్యధుర్యుం డగుచుఁ జెంగటం జెలంగు నికుంజపుంజంబులం బరిచారికలు సూపాన్నశాకంబులు పాకంబులు సేయునంతకు నిద్రాముద్రితులై సమయంబగుటయుఁ గెలంకునం బొకంబగు కొలంకున నకలంకంబు లగు జలంబులం దోఁగి సుస్నాతులై వచ్చి యచ్చటి కాయమానంబుల నాలంబమానంబు లగు గోపీచందనశ్వేతమృత్తికాదులు మతానుసారంబుగాఁ దాల్చి చను నధ్వన్యమాన్యుల నాహారంబు లడుగు తెరువరుల దీనాలాపంబులకు దుర్వారనిర్వేదంబు నొందుచు నపారపిపాసాయాసులై చేరి తదీయాధికారి దత్తామలకపూర్వకంబుగా శీతలోష్ణోదకంబుల యథాభిలాషంబుగఁ