పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226 శుకసప్తతి

సీ. సోలనీటను నీడఁ జూచుచుఁ బట్టెవ
ర్ధనము నిండఁగ నక్షతలను మెత్తి
యడుసులోఁబడు వరాహముచంద మొదవంగఁ
దగ వేఁపచెక్కగందం బలంది
నరసినసిగలోన నంబివాఁ డిచ్చిన
గన్నేరుపూవులు కొన్ని తుఱిమి
తడియాఱి యాఱకుండెడు ప్రాఁతదోవతి
బట్ట వేమఱుఁ బింజవెట్టి కట్టి
తే. కూర్మిసతి పెట్టెలో దాఁచికొన్ననల్ల
గరలపండుగుచీరఁ బైఁ గప్పుకొనుచు
నతనుఁ డెసకొల్ప దేవాలయంబుఁ జేరి
ప్రొద్దుగ్రుంకకమున్నె సొంపులు జనింప. 487

క. ఈదారిఁ జేరి యేచెలి
రాదాయె నిదేమి యనుచు బ్రాహ్మణుఁడు బహి
ర్వేదికి వచ్చుచుఁ గోవెల
లోఁ దూఱుచునుండె నంతలోనఁ దలారుల్. 488

తే. అతని తహతహ గనుఁగొని యౌర యీతఁ
డేవధూమణి రాకకో యిచట నున్న
వాఁడు మంచిది యదియును వచ్చినపుడె
పట్టుద మటంచుఁ బొంచి రో పద్మనయన. 489

ఉ. హాలికబాలికామణియు నంత నిజాంగముమీఁదనున్న ని
ద్రాళుమనోధినాథుని కరముల మెల్లనె డించి సాహస
శ్రీలసమానయై వెడలి శీఘ్రగతిం జనుదెంచి చొచ్చె దే
వాలయము న్మనోరథపరాయణుఁడైన సుశర్మ మెచ్చఁగన్. 490