పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218 శుకసప్తతి

క. ఆలని యెంచక మనియెడు
కాలంబునఁ దల్లిమాట గడవక దానం
నేలనిడి కాలరాచితి
నీలాగున వచ్చుననుచు నెవ్వఁ డెఱుంగున్. 448

తే. అనుచు ధైర్యంబుఁ దాల్చి యాయమ్మసత్య
మప్పుడేకంటి నింకఁ దా నడిగినట్లె
తీనెఁ బెట్టుక కొలిచెదఁగాని నేఁడు
మొదలు నామాటుగా నీవు మ్రొక్కికొనుము. 449

తే. అనియె నీరీతిఁ దానికై యవనిసురుఁడు
సివముపుట్టించి యపుడు చేఁజేతఁదీసి
కొనియెఁ బుట్టెఁడువిత్తులు కొలుచు మంచి
వేళవ చ్చితి ననుచు భావించుకొనుచు. 450

వ. అయ్యవసరంబున. 451

చ. తలపయిఁ బైఁటచుట్టపయిఁ దాల్చినపుట్టికలోనఁ బొల్చునం
బలిగల పంటియుం జిలుమువాయఁగ దోమిన కంచము న్సము
జ్జ్వలమగుచూపు డాలు ముఖవారిజవైరికి వెల్లపాపడ
ల్బలెఁ దగరెడ్డికోడలు విలాసముతోడుత నేగుదెంచినన్. 452

తే. అప్పు డవ్విప్రుఁ డలికఘర్మాంబుపటలి
జాఱి వీడెంపుచొళ్లుతో సంధి సేయ
బెరుఁగు నివ్వెరతో నోరు తెఱచికొనుచుఁ
దప్ప కీక్షించె దానిసౌందర్యమహిమ. 453

తే. చూచినప్పుడే విలుపాఱవై చి సరస
తామరసభీమతరగదాదండ మెత్తి