పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186 శుకసప్తతి

జాలుట గలహప్రియ కిం
కేలాగునఁ గలుగవలయు నిందునిభాస్యా. 297

తే. అనుచుఁ జిలుక పలుక నాప్రభావతి యిట్టి
యవగడంబు మాన్ప నది యెఱుంగు
నిపుడు నీ వెఱుంగు దింతియే కాని యీ
తెంపువగలు మాకుఁ దెలియ వనిన. 298

శా. కీరం బిట్లను నట్లు ఘోరతరభంగిక వ్యాఘ్రగోమాయువుల్
చేరన్రా దిలకించి యవ్వనిత కించిద్భీతియు న్లేక ధై
ర్యారూఢిన్ మృగధూర్తముం బలుకు నాహా సత్యవాక్యత్వ మీ
డేఱం దబ్బఱకాఁడ వైతి గద యింకేరీతి సైరింపుదున్. 299

తే. పులుల రెంటిని దెత్తు నీపుత్రయుగళ
మునకు నని నమ్మిక లొసంగి పోయి యిప్పు
డొక్కశార్దూలమును దెచ్చి యొప్పగించె
దొల్లఁబో కాననేఁడు నీయుసుఱుఁ గిసురు. 300

మ. అనుచుం దిగ్గునలేచుదానిఁ గని యవ్యాఘ్యేంద్ర మౌరౌర ఛ
ద్మననేసం గద నక్క యెక్కరణి నమన్వచ్చు నంచున్భయం
బున దాని న్వెస నీడ్చికొంచుఁ బఱచెన్ భూభాగ మల్లాడఁగాఁ
దనకంచుం బరువెత్తుచోఁ గలవె కాంతావంచనాసంపదల్. 301

క. అనఁ జిలుక కాప్రభావతి
మునుపటి వగకన్న నధికముగ వెఱపించెన్
వినుమా కలహప్రియ యిం
తనిరూఢంబైన నేర్పు దానికె చెల్లున్. 302